తెలంగాణ

telangana

ETV Bharat / state

వానలు సమృద్ధిగా కురిసినా.. వేసవి వస్తే దాహం కేకలు.. - Neglect on construction of pits in Nizamabad district

సాధారణానికి మించిన వర్షపాతం.. జలమయమైన రహదారులు.. మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు.. ఇదీ మున్సిపాలిటీల్లో ఈ వానాకాలం కనిపించిన దృశ్యాలు. కానీ మరో నాలుగు నెలలు గడిస్తే బోర్లు ఎత్తిపోయాయనే సమస్య ఉత్పన్నమవనుంది. భూగర్భ జలాలు అడుగుంటిపోవడంతో బోర్లను ఫ్లష్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

Sluggishness on water conservation in nizamabad district
వానలు సమృద్ధిగా కురిసినా.. వేసవి వస్తే దాహం కేకలు..

By

Published : Sep 29, 2020, 1:07 PM IST

వానాకాలం వరదల్లో మునిగిపోయే వీధులు వేసవిలో ఎద్దడి బారిన పడుతుండటానికి ఒక్కటే కారణం. భూమి నుంచి గంగమ్మను తోడుకోవడానికి అలవాటుపడిన పుర జీవి వాన నీటిని భూబ్యాంకులో ఒడిసిపట్టుకోవడాన్ని విస్మరించడమే. ఇంకుడు గుంతల నిర్మాణంపై నిర్లక్ష్యం ప్రదర్శించడమే.

పెరుగుతున్న అవసరాలు..

విద్యా, వైద్యం, జీవనోపాధి అంటూ పట్టణాలు, నగరాలకు వలసలు పెరగడంతో నీటి వినియోగం రెట్టింపవుతోంది. హోటళ్లు, ఆస్పత్రుల్లో అవసరానికి బోర్లు వేస్తూ భూమి పొరల్లో నీటిని విచ్చలవిడిగా తోడేస్తున్నారు. కానీ వాటికి పునరుజ్జీవం కల్పించాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు.

వృథాగా భావిస్తూ..

పల్లెల్లో ఉన్నట్లు పట్టణాల్లో ఖాళీ స్థలాలు అంతగా ఉండవు. అభివృద్ధి మాటున కాంక్రీటుమయమైన పురాల్లో వాన నీరు భూమిలోకి ఇంకడం కష్టం. ఈ సమస్యను అధిగమించేందుకు ఇళ్లు నిర్మించేటప్పుడే ఇంకుడు గుంత తవ్వాలనే నిబంధనను ప్రభుత్వం ధరావతుతో ముడిపెట్టింది. ఇంటి స్థలం విస్తీర్ణంపై చదరపు మీటరుకు రూ.15 వసూలు చేస్తున్నారు. 200 గజాల స్థలానికి రూ.2,500 తీసుకుంటున్నారు. ఇంకుడు గుంత నిర్మించుకున్న తర్వాత ఈ నగదును తిరిగి ఇచ్చేస్తారు. కానీ గుంత నిర్మాణానికి రూ.10 వేలకు పైగా వ్యయమవుతుండటంతో ప్రజలు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. వెరసి బల్దియాల వద్ద ధరావతు పోగుబడుతోంది.

కొత్త బల్దియాలు ఇటీవల వరకు పంచాయతీలుగా ఉన్నాయి. బాన్సవాడ, భీమ్‌గల్‌, ఎల్లారెడ్డిలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టారు. అవి పట్టణాలుగా అవతరించాక పథకం నిలిచిపోయింది. ప్రస్తుతం కొత్త ఇంటి నిర్మాణ సమయంలో ఎవరికి వారే కట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరి నుంచి ప్రోత్సాహం అందదు. పాత బల్దియాల్లో ప్రజలు స్థలం, ఖర్చు వృథా భావనతో నిర్మాణాలకు దూరంగా ఉంటున్నారు. కొత్త వాటిలోనూ అదే ధోరణి రాకుండా అధికారులు అప్రమత్తం కావాలి.

ఇలా చేయాలి

వానాకాలంలో పుష్కలంగా కురిసే వానను ఇంకించినా, నిల్వ చేసుకున్నా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంకుడు గుంతల ప్రాధాన్యం తెలిపేలా ప్రజలకు అవగాహన పెంచాలి. కాలనీల్లో సదస్సులు నిర్వహించాలి, ఏ సమావేశమైనా గుంతల ప్రస్తావన ఉండేలా చూసుకోవాలి. స్వచ్ఛంద సంస్థల సేవలు ఉపయోగించుకోవాలి. నిర్మాణం చేపట్టిన వారికి ప్రోత్సాహకంగా బహుమతులు ఇస్తుండాలి. బహిరంగ స్థలాల్లో అవకాశాన్ని బట్టి బల్దియాలే నిర్మాణాలు చేపట్టాలి. ఎల్‌ఆర్‌ఎస్‌, ఆస్తుల నమోదు సర్వేలో ఇంకుడు గుంతల వివరాలు తెలుసుకోవాలి. ప్రజలు పరిస్థితుల ఆధారంగా నిర్మాణాలు చేపడితే వాననీరు రహదారులపై పారుతూనే ఉంటుంది. మరోవైపు బోర్లు పునరుజ్జీమవుతాయని గ్రహించాలి.

ఒక ఇంటితో 55వేల లీటర్లు...

ఒక 100 చదరపు మీటర్ల భవనంపై ఒకసారి 20 మి.మీ. వర్షం పడితే ఏడాదంతా 780 మి.మీ వార్షిక వర్షపాతం నమోదవుతుందని అంచనా. ఈ వాన నీటిని 6 క్యూబిక్‌ మీటర్ల ఇంకుడు గుంతతో నిల్వ చేసుకుంటే ఐదుగురు ఉన్న కుటుంబ సభ్యులకు 110 లీటర్ల చొప్పున 100 రోజుల నీటిని అందించవచ్చని హైదరాబాద్‌ జలమండలి చెబుతోంది. 100 చ.మీ ఒక గృహంతో 55 వేల లీటర్లు ఆదా చేయొచ్చంటే పట్టణ విస్తీర్ణంలో ఉన్న భవనాలన్నింటినీ లెక్కిస్తే కోట్లాది లీటర్లు ఆదా అవుతాయి.

ఇంకుడు గుంతలపై అవగాహన కల్పిస్తాం

పట్టణాల్లో ప్రతి ఇంట్లోనూ ఇంకుడు గుంత నిర్మించుకోవాల్సిందే. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తాం. రాబోయే రోజుల దృష్ట్యా భూగర్భ జలమట్టం పెంచుకోవాల్సిన అవసరముంది.- రామలింగం, మున్సిపల్‌ కమిషనర్‌

పట్టణాల్లో భవనాల పరిస్థితులు..

ఇవీ చూడండి:'ఆయుర్వేదం'తో 5 రోజుల్లో కరోనా మాయం!

ABOUT THE AUTHOR

...view details