నిజామాబాద్ నగరంలో నాసిరకం పనులు నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో గుత్తేదారులు.. మురుగు నీటి కాల్వలను నాణ్యతా లోపంతో నిర్మిస్తున్నారు. నగరంలో 60 డివిజన్లు ఉంటాయి. గత జులైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనుల కోసం డివిజన్‌కు రూ.10 లక్షల చొప్పున నగర పాలక సంస్థ సాధారణ బడ్జెట్ నుంచి కేటాయించారు. ఈ పనులతో ప్రతి డివిజన్‌లో వివిధ పనులు చేపట్టారు. మురుగు కాల్వలు, కల్వర్టులు, రోడ్లు వంటి పనులను చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ నిధులతో నగర పాలక సంస్థ పరిధిలో మురుగు కాల్వల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 35 డివిజన్లలో 9కి.మీ.ల మేర ఆ పనులు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం గుత్తేదారు నిర్మాణం చేపట్టకపోవడంతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకొర పనులపై అనుమానం వెల్లువెత్తుతోంది. కనీస నిబంధనలు పాటించకుండా నిర్మించడం వల్ల కాల్వల నాణ్యతపై కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కంకర డస్ట్‌తో నిర్మాణాలు
నగరంలోని కోటగల్లి, న్యాల్ కల్ రోడ్డు, కంఠేశ్వర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. అయితే పనుల్లో నాణ్యతకు గుత్తేదారు తిలోదకాలిచ్చారు. ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. అవసరమైన మోతాదులో ఇనుము, కంకర, ఇసుక, సిమెంటు వాడటం లేదు. నిర్మాణంలో ఎక్కడా ఇసుక కనిపించడం లేదు. ఎక్కడ చూసినా రోబో సాండ్, సాండ్ మిక్స్ పేరుతో పిలుస్తున్న కంకర డస్ట్ మాత్రమే కనిపిస్తోంది. ఇక ఇనుము సైతం ఒక చోట వాడితే మరోచోట కనిపించడం లేదు. సిమెంటు కూడా సరిపడా వాడకపోవడంతో నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మాణ పనులు చేస్తున్న వారిని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా ఇసుక వినియోగించకుండా వాడుతున్నారని.. ఎన్నాళ్లు ఉంటాయో తెలియడం లేదని చెబుతున్నారు.