కరోనా కారణంగా ఏర్పడిన నష్టాలను పూడ్చుకునే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. కొవిడ్‌తో ప్రయాణికులు తగ్గి కోల్పోయిన ఆదాయాన్ని కార్గో సేవల ద్వారా సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. వైరస్ కారణంగా ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే నెలకు రూ.అర కోటి వరకు సంస్థ ఆదాయానికి గండిపడగా.. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సరకు రవాణా, పార్శిల్, కొరియర్ సేవలు అందిస్తోంది. ఎరువులు, ధాన్యం, బియ్యం వంటివి రవాణా చేస్తూ ఆదాయం పొందుతోంది.
రోజుకు రూ. 20 నుంచి 30 వేల వరకు ఆదాయం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 711 ప్రజా రవాణా బస్సులు, 28 కార్గో బస్సులు అందుబాటులో ఉన్నాయి. కార్గో బస్సులను సరకు రవాణాకు వినియోగిస్తుండగా.. సాధారణ బస్సులను పార్శిల్, కొరియర్ సర్వీసుల కోసం వినియోగిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య సగానికి తగ్గింది. ఫలితంగా ఆ నష్టాలను పార్శిల్స్, కొరియర్ సర్వీసులతో పూడ్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ డిపోల్లో పార్శిల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో తగ్గిన ప్రయాణికుల స్థానంలో పార్శిల్, కొరియర్ సేవలతో భర్తీ చేస్తున్నారు. వీటి ద్వారా ప్రతి రోజూ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆర్టీసీకి ఆదాయం సమకూరుతోంది.