తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపు పంటకు రూ.12 వేలు మద్దతు ధర ఇస్తాం: రేవంత్‌రెడ్డి - బీఆర్​ఎస్ పై రేవంత్ ఫైర్

Revanthreddy Comments at Hath Se Hath Jodo Yatra : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, పంటల బీమా, కర్షకులకు ఆరోగ్య కార్డులు, పసుపు పంటకు 12 వేల మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పంటల బీమా లేనందునే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ధ్వజమెత్తారు.

Revanthreddy
Revanthreddy

By

Published : Mar 12, 2023, 8:02 PM IST

Revanthreddy Comments at Hath Se Hath Jodo Yatra : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్​ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. శనివారం రాత్రి కమ్మరపల్లి మండల కేంద్రంలో బస చేసిన రేవంత్​.. ఉదయం భీంగల్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేగు బంధం ఉందన్నారు.

తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం, కేంద్రంలో అధికారం కోల్పోయిందన్న రేవంత్​రెడ్డి.. ఆంధ్రాలోను పార్టీ చచ్చి పోయిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ దొరల పాలనలో బందీ అయిందని విముక్తి కోసం పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మంచి రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరి వ్యక్తిగా చెప్పుకొనే మంత్రి ప్రశాంత్​రెడ్డి జిల్లాలో చక్కెర కర్మాగారం ఎందుకు తెరిపించలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం కొనుక్కునేవారని.. ప్రస్తుత పరిస్థితికి ఎంపీ అర్వింద్ కారణమని మండిపడ్డారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయో తెలపాలని డిమాండ్ చేశారు.

అన్నదాతల సమస్యల కోసం రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తాం:రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, పంటల బీమా, కర్షకులకు ఆరోగ్య కార్డులు, పసుపు పంటకు 12 వేల మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి.. గుజరాత్‌ మోడల్‌, తెలంగాణ మోడల్‌పై విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్‌ రాసి ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ స్పైస్‌ బోర్డు అంటూ మాటమార్చుతున్నారని ఎద్దేవా చేశారు.

'వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ఒక అగ్రిమెంట్‌గా భావిస్తున్నాం. కాంగ్రెస్‌ను గెలిపిస్తే చక్కెర పరిశ్రమలు పునరుద్ధరిస్తాం. పంటలబీమాను పకడ్బందీగా అమలు చేస్తాం. రైతులకు హెల్త్ కార్డులు ఇస్తాం. పసుపు పంటకు రూ.12 వేలు మద్దతు ధర ఇస్తాం. పంటల బీమా లేనందునే రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. తెలంగాణ మోడల్ అంటే 3 వేల వైన్‌షాపులు, 60 వేల బెల్ట్ షాపులా.'- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

సోమవారం నుంచి ఈ నెల 18 వరకు నిజామాబాద్ జిల్లాలో రేవంత్ పాదయాత్ర సాగనుంది. వారం మధ్యలో 15వ తేదీన హైదరాబాద్‌లో జరిగే పార్టీ సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉండటంతో ఆరోజు విరామం ప్రకటించారు.

పసుపు పంటకు రూ.12 వేలు మద్దతు ధర ఇస్తాం: రేవంత్‌రెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details