అరుదైన వ్యాధితో బాధపడుతోన్న నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన పదహారేళ్ల బాలుడు దీపక్‌పై ఈటీవీ-ఈటీవీ భారత్‌లో ప్రసారమైన కథనానికి స్పందన లభించింది. 'మాత్ర ఉంటేనే మూత్రం ఆగేది.. దాతలు ఆదుకుంటేనే ఆ మాత్ర దొరికేది!' పేరిట ప్రచురితమైన కథనానికి నిజామాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సుజాత మానవత్వంతో స్పందించారు. దీపక్‌కు సాయం చేస్తానంటూ ముందుకొచ్చారు.
దీపక్‌కు అవసరమయ్యే మాత్రలను ప్రతి నెలా అందిస్తామని డాక్టర్ సుజాత పేర్కొన్నారు. దీంతోపాటు పౌష్టికాహారం కోసం కొంత డబ్బులు ఇస్తామని తెలిపారు. దీపక్ జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన మరో దాత రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
వెంటాడిన అనారోగ్యం..
దీపక్‌ను చిన్నప్పటి నుంచే అనారోగ్యం వెంటాడుతోంది. చివరకు జీవితకాలం వెంటాడే వ్యాధిగా తేలింది. ఐదేళ్ల ప్రాయంలోనే దీపక్‌కు డెంగీ సోకితే హైదరాబాద్‌కు తీసుకెళ్లి నయం చేయించుకొచ్చారు. అప్పుడే చాలా డబ్బులు ఖర్చు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో... ముక్కులో నుంచి రక్తం కారడం మొదలైంది. ఏమిటా అని ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎన్నో పరీక్షలు చేయించారు. పరీక్షలకు డబ్బులు లేక సతమతమవుతుంటే... స్థానిక కౌన్సిలర్ పద్మ కుటుంబం ద్వారా ఎమ్మెల్యే షకీల్‌ను సంప్రదించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత ఆర్థిక సాయంతో హైదరాబాద్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకున్నారు. మూడేళ్ల కిందట ఉపాధ్యాయురాలు సుధ కొన్ని పరీక్షలు చేయించారు.