Rahul Gandhi Speech at Mortad Corner Meeting in Nizamabad District : నిజామాబాద్ జిల్లా రాహుల్ గాంధీ బస్సు యాత్ర ప్రవేశించింది. మోర్తాడ్ చేరుకున్న రాహుల్.. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ప్రసగించారు. తనకు దేశంలో ఇల్లు అవసరం లేదని.. కోట్లాది ప్రజల గుండెల్లో ఉన్న చోటు చాలు తనకని అన్నారు. కేసీఆర్ ఆస్తుల మీద ఈడీ, ఐటీ విచారణలు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పరస్పరం సహకరించుకుంటాయని ఆరోపించారు. పార్లమెంట్‌లో భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు.. భారత్ రాష్ట్ర సమితి మద్దతు ఇచ్చిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
Rahul Gandhi Visit to Nizamabad District : ఈసారి ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఖతమ్ అయిందని.. ఆ పార్టీలోని నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామని అడుగుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఈసారి ఏర్పడేది ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తల సర్కార్ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు.
శాండ్, ల్యాండ్, మైన్.. ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను అబద్ధపు వాగ్దానాలు చేయడానికి రాలేదని.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించామని.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను (Six Guarantees)అమలు చేస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Congress Bus Yatra 2023 : మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ నెలా మహిళలకు రూ.2500 అందిస్తామని.. ఆర్టీసీ బస్సుల్లో ఆడవారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు చెప్పారు. అన్నదాతలకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. పసుపు రైతులకు క్వింటాకు రూ.12,000 ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు.