Students Complaints On Ragging Issue: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ శివారులోని తిరుమల ఫార్మసీ కళాశాలలో ఈనెల 19న స్వాగతోత్సవం ఉంది. మొదటి ఏడాది విద్యార్థులకు స్వాగతం పలుకుతూ రెండో ఏడాది విద్యార్థులు చేస్తున్న వేడుక ఇది. ఈ వారం మెుత్తం ఆ కళాశాలలో ఫ్రెషర్స్ వీక్ గా జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే 13తేదీన రెండు, మూడో ఏడాది విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది. మూడో ఏడాది విద్యార్థులు తమను ర్యాగింగ్ చేస్తున్నారని, వాష్ రూమ్స్‌కు వెళ్లేటప్పుడు అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ రెండో సంవత్సరం ఫార్మసీ విద్యార్థులు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో బాధ్యులను సస్పెండ్ చేస్తామని యాజమాన్యం వెల్లడించింది. స్వాగతోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందించేందుకు వెళ్లిన విద్యార్థినిలతో అసభ్యంగా మాట్లాడారంటూ రెండో ఏడాది విద్యార్థినీ, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తాము కళాశాలలో చేసిన అలంకరణను సీనియర్లు ధ్వంసం చేసి తమపై దాడి చేశారని రెండో ఏడాది విద్యార్థులు ఆరోపించారు. ఇరువర్గాల మధ్య గొడవ తీవ్రమైంది.
తల్లిదండ్రులకు విషయం తెలిసి పోలీసులకు చెప్పగా గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆందోళకు కారణమైన కొంత మంది విద్యార్థులను డిచ్‌పల్లి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని.. కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే సీనియర్ విద్యార్థులను వదిలేసి తమ క్లాస్ వాళ్లనే బాధ్యులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని రెండో ఏడాది విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీనియర్స్ తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే అంతకు ముందే సీనియర్ విద్యార్థినులు సైతం సీపీకి ఫిర్యాదు చేశారు. అసలు ర్యాగింగ్ జరగలేదని.. కేవలం గొడవ మాత్రమే జరిగిందని అన్నారు. జూనియర్లే తమను వేధించారని సీనియర్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కళాశాలలో అంత పెద్ద గొడవ జరుగుతుంటే కనీసం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం సైతం గొడవ అయ్యేదాకా కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేసిన విద్యార్థినులు, తల్లిదండ్రులపైనే ఎందుకు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ఘటనపై మీడియాతో మాట్లాడిన నలుగురు రెండో ఏడాది విద్యార్థినిలను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు బాధిత విద్యార్థినిలు చెబుతున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులను సైతం డిచ్‌పల్లి పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిసింది. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కళాశాల యాజమాన్యం వివాదం సద్దుమణిగేలా చూడాల్సిన అవసరం ఉంది.
ఇవీ చదవండి: