Nizamabad DSA ground problems : ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే అది మరింత వికసిస్తుంది. దాగి ఉన్న సత్తాను గుర్తించి సానబెడితే మరింత మెరుగుపడుతుంది. మట్టిలో నుంచి మాణిక్యాలు బయటపడతాయి. అయితే దీనికి కావాల్సింది వెన్నుతట్టి నడిపించే ఉత్సాహమే. అలా నిజామాబాద్ జిల్లా నుంచి దేశానికి దక్కిన క్రీడా ఆణిముత్యాలు అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్, మరో బాక్సర్ హుసాముద్దీన్, ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య, ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య . ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి జిల్లా పేరును వీరంతా మారుమోగించారు.
ఇందూరు క్రీడా చరిత్రలో తొలి అర్జున పురస్కారంనిఖత్ జరీన్‌కు దక్కింది. ఇలాంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని అనేక మంది బాలబాలికలు క్రీడారంగం వైపు వస్తున్నారు. గ్రామ, జిల్లా స్థాయిలో సత్తా చాటుకుంటున్నారు. అయితే వీరికి సదుపాయాల లేమి పెద్ద సమస్యగా మారింది. శిక్షకుల కొరత కూడా వీరిని వేధిస్తోంది. నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. అయితే పతకాలు సాధించగానే వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నా స్థానికంగా క్రీడా మైదానాల్లో సరైన వసతులు లేవు. శిక్షకుల నియామకం ఆగిపోయింది.
Nizamabad Sport Persons : రాష్ట్ర స్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నా జిల్లా స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నగరంలో డీఎస్ఏ మైదానం, నాగారంలోని రాజారాం స్టేడియాలు ఉన్నా అవి కేవలం ఆట స్థలాలు మాత్రమే. అక్కడ ఎలాంటి వసతులు లేవు. క్రీడాకారులు శిక్షణ పొందేందుకు అనుకూలమైన ఒక్క మైదానమూ జిల్లాలో అందుబాటులో లేదు. దీంతో అరకొర సాధనతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. డీఎస్ఏ మైదానంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగ్.. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను దేశానికి అందించింది. మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఈ మైదానంలోనే ఐదేళ్లు సాధన చేసింది.
"ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. వారిలా మేము కూడా మంచి పతకాలు గెలవాలని వచ్చాం. కానీ ఇక్కడ అలాంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం స్పందించి వెంటనే క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం."- సాయి దివ్య కబడ్డీ క్రీడాకారిణి
Nizamabad DSA ground problems : కామన్వెల్త్ లో పతకాలు సాధించిన హుసాముద్దీన్ సైతం బాక్సింగ్‌లో ఓనమాలు ఇక్కడే నేర్చుకున్నాడు. ఇలాంటి ప్రతిభావంతులు ఉన్న నిజామాబాద్ జిల్లాలో క్రీడాసౌకర్యాలు కల్పించడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించడం లేదు. బాక్సింగ్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు హుసాముద్దీన్ అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతున్నాడు. తండ్రి సంసముద్దీన్ శిక్షణతో బాక్సింగ్‌లో రాణిస్తున్న హుసాముద్దీన్.. కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు కాంస్యం అందుకున్నాడు. జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించాడు. ఆసియా ఎలైట్ బాక్సింగ్‌లోనూ కాంస్యం దక్కించుకున్నాడు.
ఆర్మీలో సుబేదార్ హోదాలో పని చేస్తున్నాడు. జిల్లాకు చెందిన ఇతర క్రీడాకారులు సైతం వీరి బాటలో నడవాలంటే ప్రభుత్వం చొరవ చూపి బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జాతీయ క్రీడ హాకీలో నిజామాబాద్ జిల్లాకు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా లభించింది. జిల్లాకు చెందిన క్రీడాకారిణి యెండల సౌందర్య హాకీలో అదరొగట్టి ఇందూరు పేరును ప్రపంచంలో నెలబెట్టింది. ఈమె ప్రస్తుతం భారత సీనియర్ మహిళా జట్టు శిక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు. సౌందర్య సాధన చేసింది సైతం నగరంలోని డీఎస్ఏ మైదానంలోనే.