Private ambulance burnt: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మాక్లూర్ తండా సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ అంబులెన్స్ దగ్ధమైంది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తోన్న 13 ఎద్దులు మృతి చెందినట్లు పశు వైద్యులు ధృవీకరించారు. ఆదివారం ఉదయం పోలీసులు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల సమక్షంలో పశు వైద్యుడు గంగా ప్రసాద్ పోస్టుమార్టం నిర్వహించారు. ఎక్కువ శాతం కాలడంతో పాటు పొగకు ఊపిరి ఆడక జీవాలు మృతి చెంది ఉంటాయని వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పశువుల వయస్సు 2 నుంచి 8 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు.
ప్రైవేట్ వాహనాన్ని అంబులెన్స్‌గా తీర్చిదిద్ది..: ఈ ఘటనలో ఇద్దరు నిందితులను గుర్తించినట్లు డిచ్పల్లి సీఐ ప్రతాప్ పేర్కొన్నారు. ప్రైవేట్ వాహనాన్ని అంబులెన్స్ మాదిరిగా తీర్చిదిద్ది.. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. పశువుల కాళ్లను కట్టేసి.. పరిమితికి మించి లోపల కుక్కి.. పక్కా ప్రణాళిక ప్రకారం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి.. నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.