Godavari river Projects in Telangana : మహారాష్ట్ర నుంచి ఎస్సారెస్పీకి భారీగా వరదవచ్చి చేరుతుండగా.. అటు ఉపనదుల నుంచి గోదావరికి క్రమక్రమంగా ప్రవాహం పెరుగుతోంది. శ్రీరాంసాగర్‌కు ప్రస్తుతం 92,590 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. 1,091 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 1,076.10 అడుగులకు చేరింది. 90 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యానికి.. ప్రస్తుతం 42.452 టీఎంసీలు ఉన్నాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి లక్షా 70వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. 18 గేట్లకు గాను 14 గేట్లు ఎత్తి 1,76,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 695.95 అడుగులకు చేరుకుంది. నిర్మల్ జిల్లా స్వర్ణ జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,189 అడుగులు కాగా... ప్రస్తుతం 1,177 అడుగులకు చేరింది. వెయ్యి క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
నిండుకుండలా ఎల్లంపల్లి.. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరి నిండుకుండను తలపిస్తోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146.40 మీటర్లకు చేరింది. నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.37 టీఎంసీలకు చేరింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత పరుగులు పెడుతోంది. త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 9.980 మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది.
మేడిగడ్డకు పోటెత్తిన వరద.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండగా.. లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి లక్ష్మీ బ్యారేజీకి 4లక్షల 87వేల 560 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా.. 65 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదలచేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో ఉన్న 3.2టీఎంసీల నీటి నిల్వను క్రమంగా తగ్గిస్తున్నారు.