Prashanth Reddy Comments: రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించిన రాజీనామా సవాల్‌కు కట్టబడి ఉన్నానని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీని భాజపా విస్మరించిందని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం బండి సంజయ్ తలపెట్టిన మిలియన్ మార్చ్ దిల్లీలో చేయాలని ఎద్దేవా చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేల్పూర్ మండలం మోతె గ్రామంలోని కప్పల వాగుపై 12 కోట్లతో హైలెవల్ వంతెనకు శంకుస్థాపన చేశారు. మోర్తాడ్ మండలం వడ్ల గ్రామంలో రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
'బండి సంజయ్ పచ్చి అబద్ధాలకోరు. మోదీ ఇచ్చిన ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ ఏమైంది? కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఉద్యోగాల కోసం దిల్లీలో మిలియన్ మార్చ్ చేయాలి. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కొత్తగా 17 వేల పరిశ్రమలతో 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంతకంటే ఎక్కువగా భాజపా రాష్ట్రాల్లో ఇస్తే నేను రాజీనామాకు సిద్ధం.'