అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు భయంతో వణుకుతున్నాయి. వేటగాళ్ల తుపాకులు ఎక్కడ గర్జిస్తాయో.. ఏ వైపు నుంచి తూటాలు దూసుకొస్తాయో.. ఏ ప్రాంతంలో ఏ ఉచ్చు ఉందో తెలియక అల్లాడిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి కొందరు వారంతాల్లో అత్యాధునిక ఆయుధాలతో అడవుల్లో వేటకు దిగుతున్నారు. వన్యప్రాణులను హతమార్చి మాంసాన్ని తినడం, మిత్రులనూ తీసుకెళ్లి వారికి రుచి చూపిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణకు కఠిన చట్టాలు వచ్చినా వాళ్లు ఖాతరు చేయట్లేదు. నిజామాబాద్ అడవులతో పాటు నర్సాపూర్, వికారాబాద్, కామారెడ్డి, బాసర, భూపాలపల్లి, నారాయణపేట జిల్లా కృష్ణా నది తీరంలో అటు నుంచి కర్ణాటకలోని ఉద్గిర్ వరకు జింకలు, అడవి పందుల వేట సాగుతున్నట్లు అటవీశాఖ నిఘా విభాగం గుర్తించింది.
గుట్టు తెలియకుండా...
అడవుల్లో వేటకు వెళుతున్న వేటగాళ్లు తమ గుట్టు బయటపడకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యాధునిక ఆయుధాలు, పరికరాలతో అడవుల్లో తిరుగుతున్నారు. కాలిస్తే ఆ శబ్దం విన్పించకుండా సైలెన్సర్లు అమర్చిన తుపాకులు వాడుతున్నారు. చీకట్లో వన్యప్రాణుల్ని గుర్తిచేందుకు శక్తిమంతమైన సెర్చ్‌లైట్లు ఉపయోగిస్తున్నారు. వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న విదేశీ ఆయుధాల్ని చూసి అటవీ అధికారులే విస్మయానికి గురవుతున్నారు.
లైసెన్స్‌ల దుర్వినియోగం...
వన్యప్రాణుల వేట ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల రేంజ్ ప్రాంతంలో తుపాకీలతో దుప్పులను వేటాడి తరలిస్తుండగా మూడేళ్ల క్రితం పట్టుకున్నారు. ఆ తర్వాత ఓ వ్యక్తి జింక మాంసం విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ‘తెలంగాణలో పలుచోట్ల అడవిపందులను, జింకలను వేటాడుతున్నారు. స్పోర్ట్స్ గన్‌లైసెన్సులు తీసుకున్నవాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు’ అని ఓ వన్యప్రాణి నిపుణుడు ఆందోళన వ్యక్తం చేశారు.