తెల్లారేసరికి ఎంత మంది బతుకులు తెల్లారిపోతున్నాయో తెలియడం లేదు. క్షణ క్షణానికి ఎంత మందిని కబళిస్తోందో లెక్కపెట్టలేకపోతున్నాం. కోరలు చాస్తున్న కరోనా మృత్యవాహనమెక్కి విలయ తాండవం చేస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తీసుకుపోతుంది. కొవిడ్ గురించి ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారడం లేదు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీ పేటలో బీరప్ప పండుగ సందర్భంగా కొవిడ్ నిబంధనలు గాలికొదిలేశారు. కుర్మ సామాజిక వర్గం ఐదేళ్లకోసారి జరుపుకునే బీరప్ప పండుగను గతేడాది లాక్డౌన్ కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది అదే పరిస్థితి తలెత్తడం వల్ల... భక్తుల విజ్ఞప్తిపై అధికారులు అనుమతిచ్చారు. సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో వేడుక చేసుకోవాలని సూచించారు.