Revanth Reddy On Ktr Comments: కామారెడ్డి జిల్లా పిట్లాంలో కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం అభివృద్ధి చెయ్యలేదని.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఒక్క అవకాశం అని మళ్లీ అడుగుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై నిజామాబాద్ నగరంలో పాదయాత్ర క్యాంప్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో అభివృద్ధి చేసిందే.. కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.
రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు, 1000 జూనియర్ కాలేజీలు, 100 డిగ్రీ కాలేజీలు, 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్, కేటీఆర్ చదువుకున్న పాఠశాలలు నిర్మించింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే అని గుర్తుచేశారు. చివరకు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అన్నారు. మేం తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారని రేవంత్‌రెడ్డి చెప్పారు. 24 గంటల కరెంటు ఈ ప్రభుత్వం ఇస్తుందని నిరూపిస్తే.. తాను దేనికైనా సిద్ధమన్నారు.
మీరేం చేశారో.. మేమేం చేశామో మీడియా మిత్రుల సమక్షంలో చర్చకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మేం ఏమేం చేశామో నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టమీదైనా.. ఇంకెక్కడైనా మాట్లాడేందుకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ చేసింది.. 30 వేల వైన్ షాపులు.. 60 వేల బెల్ట్ షాపులు పెట్టడం మాత్రమేనని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అంతకు మించి రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసింది ఏం లేదన్నారు.