తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలు ఎలా ఉన్నారో..?, ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన - ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

students trapped in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుతున్న కరీంనగర్​, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జగిత్యాల జిల్లాలకు చెందిన విద్యార్థుల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని.. తమవారిని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు నిన్న వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 30మంది తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు.

students trapped in Ukraine
students trapped in Ukraine

By

Published : Feb 24, 2022, 4:51 PM IST

Updated : Feb 24, 2022, 10:42 PM IST

పిల్లలు ఎలా ఉన్నారో..?, ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన

students trapped in Ukraine: ఉక్రెయిన్​​లో యుద్ధం ప్రారంభం కావడంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డల క్షేమ సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తన పిల్లలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సుమారు 2వేల మంది తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్​లో ఉన్నారు.

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని కడారి సుమాంజలి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో చిక్కుకుందని ఆమె తండ్రి కడారి రాజయ్య తెలిపారు. ఉక్రెయిన్​లో గత ఏడేళ్లుగా ఆమె చదువుతున్నట్లు చెప్పారు. అయితే ఆ దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో భారత్​కు వచ్చేందుకు సిద్ధమైందని రాజయ్య తెలిపారు. కీవ్​ నగరానికి చేరుకొనే సరికే.. యుద్ధం ప్రారంభమైందని.. దాంతో ఎయిర్​పోర్ట్​లోనే చిక్కుకున్నట్లు తమకు ఫోన్​ చేసి చెప్పిందని ఆమె తండ్రి చెప్పారు. తన కుమార్తెతో పాటు మరో 20 మంది భారతీయ విద్యార్థులు ఎయిర్​పోర్టులోనే చిక్కుకున్నట్లు చెప్పిందని రాజయ్య చెప్పారు. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నా.. తినేందుకు ఆహారం లేదందని రాజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

'ఇండియాకు వచ్చేందుకు ఫ్లైట్​ టికెట్లు బుక్​ చేసుకుంది. ఎయిర్​పోర్టుకు వచ్చేసరికే పరిస్థితి ఆందోళకరంగా మారింది. దాంతో ఎయిర్​పోర్టులోనే చిక్కుకుపోయింది. మొత్తం 20 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నట్లు చెప్పింది. క్షేమంగానే ఉన్నా.. ఆహారం, నీళ్లు అందుబాటులో లేవని చెప్పింది.'

- కడారి రాజయ్య, సుమాంజలి తండ్రి

ఉక్రెయిన్​లో బోధన్ విద్యార్థి..

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన నరేందర్​బాబు కుమారుడు వినయ్​ ఉక్రెయిన్​లో చదువుతున్నాడు. ఓజోరాన్ యూనివర్సిటీలో ఎంబీబీస్ తృతీయ సంవత్సరం చదువుతున్నట్లు ఆయన తండ్రి చెప్పారు. తమ కుమారుడు ఈ రోజు ఉదయం ఫోన్​ చేశాడని.. ప్రస్తుతం తమ కుమారుడు ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి బాగానే ఉందని చెప్పినట్లు తెలిపారు. గంట గంటకు పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తన కుమారుడిని స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.

'మా కుమారుడు వినయ్​ ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్​ మూడో సంవత్సవం చదువుతున్నాడు. యుద్ధ భయాలతో ఫ్లైట్​ టికెట్లు బుక్​ చేసుకున్నారు. యుద్ధం ప్రారంభం కావడంతో ఫ్లైట్స్​ క్యాన్సిల్​ అయ్యాయి. ప్రస్తుతానికి ఇబ్బంది లేదని, సురక్షితంగానే ఉన్నామని చెప్పాడు.'

- నరేంద్రబాబు, వినయ్​ తండ్రి

రెడీగా ఉండమన్నారు...

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం శ్రీరామనగర్​కు చెందిన గంజి సూర్యనారాయణ కుమారుడు భానుప్రసాద్​ 2019లో మెడిసిన్​ చదువుకొనేందుకు ఉక్రెయిన్​ వెళ్లాడు. తాజా పరిస్థితిపై ఆయన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికే చెందిన రామకృష్ణ, రత్నదీపల కుమారుడు శేష ఫణిచంద్ర.. 2017లో మెడిసిన్​ కోసం ఉక్రెయిన్​ వెళ్లాడు. జాఫ్రజియా యూనివర్సీటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులతో ఇండియన్​ ఎంబసీ విద్యార్థులు మాట్లాడినట్లు వారి తల్లిదండ్రులు చెప్పారు. వర్సిటీలోనే సురక్షిత ప్రాంతంలో ఉంచినట్లు చెప్పారు. విమానాల రాకపోకలు ప్రారంభమయితే.. ఇండియా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. ఈ మేరకు తమకు వీడియో కాల్​ చేసిన మాట్లాడినట్లు తెలిపారు.

ఆందోళనగా ఉంది..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డి కుంటకు చెందిన పేరుమాళ్ల బాలస్వామి రెండో కుమారుడు అజయ్​కుమార్​ ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. మూడు నెలల్లో కోర్సు పూర్తికానుందని.. ఇంతలోనే ఉక్రెయిన్​లో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అజయ్​ తల్లిదండ్రులు చెప్పారు. ఇవాళే తమ కుమారుడు ఫోన్​ చేశాడని.. ఎటువంటి ఇబ్బందిలేదని చెప్పాడని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేసి భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

క్షేమంగా ఇంటికి చేర్చాలి..

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణం బీడీ కాలనీకి చెందిన తూముల లింగమూర్తి రెండో కుమార్తె భవాని.. ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. ఉక్రెయిన్​లో తాజా పరిస్థితిపై భవాని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ కుమార్తెను క్షేమంగా ఇంటికి చేర్చాలని వారు కోరుతున్నారు.

1500 మంది ఉన్నాం..

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్​కు చెందిన బద్దం నిహారిక రెడ్డి ఉక్రెయిన్​లో మెడిసిన్​ చదువుతోంది. ఉక్రెయిన్​లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నిహారిక పరిస్థితిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఫోన్​ చేసి తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పిందని తెలిపారు. ఇక్కడ సుమారు 1500 మంది విద్యార్థులు ఉన్నామని.. అంతా బాాగానే ఉన్నామని చెప్పినట్లు వారు తెలిపారు. కేంద్రం తక్షణమే ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేసి భారత విద్యార్థులను స్వదేశానికి చేర్చాలని కోరారు.

ఇదీచూడండి:ఉక్రెయిన్​లో చిక్కుకున్న కరీంనగర్​ విద్యార్థులు.. బండి సంజయ్​కు ఫోన్​

Last Updated : Feb 24, 2022, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details