నిజామాబాద్ జిల్లాలోని చెరువులకు జలకళ వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు పల్లె ఆయకట్టుకు చేవ తెచ్చింది. ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి. రైతులు, మత్స్యకారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పంటలకు అవసరమైన సాగు నీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు సాగుదారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3206 చెరువులున్నాయి. ఈనెల 13 నుంచి 20వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాలోని 866 చెరువులు నిండి అలుగు పారాయి. గతేడాది కేవలం 189చెరువులు మాత్రమే నిండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య గణనీయంగా పెరగడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు.
ఈ ఏడాది వర్షాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులకు దాదాపుగా వరద నీరు వచ్చి చేరింది . దీంతో రెండు పంటల సాగుకు ఢోకాలేదంటున్నారు కర్షకులు. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో భూగర్భజలాలు కూడా పెరిగాయి..దీంతో రైతులు ఖుషీఖుషీగా ఉన్నారు. గతంలో వర్షాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇప్పుడు ప్రతి రైతుకు చేతినిండా పని ఉందని కర్షకులు అంటున్నారు. మత్స్యకారులకు కూడా మంచి ఉపాధి లభిస్తుందని అంటున్నారు.