గోదారమ్మ పరవళ్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళతో తొణికిసలాడుతోంది. ఈనెల మొదటి వారం నుంచి వర్షాలతో మొదలైన వరద ప్రవాహం వల్ల 18రోజుల్లోనే ప్రాజెక్టులోకి 50టీఎంసీలకు పైగా నీరు చేరింది. ఈ ఏడాది జూన్ 1నుంచి ఇప్పటి వరకు శ్రీరాంసాగర్‌లోకి 70 టీఎంసీల నీరు వచ్చింది. ఎస్సార్ఎస్పీలో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుతుండగా ప్రాజెక్ట్ పరిసరాలు ఆహ్లాదకరంగా మారిపోయాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా భావిస్తారు. ఈ ప్రాజెక్టు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నీటి అవసరాలు తీరుస్తోంది. మహారాష్ట్రలో నిర్మించిన అనేక ప్రాజెక్టుల కారణంగా కొన్నేళ్లుగా నీరు చేరడం గగనమైంది. స్థానికంగా భారీ వర్షాలు కురిస్తే.. లేదంటే మహారాష్ట్రలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండి దిగువకు విడుదల చేస్తే తప్ప ఎస్సార్ఎస్పీలో జలకళ అనేది లేకుండా పోయింది. 2016 నుంచి వరుసగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉంటున్నాయి. 2016, 2018, 2019లో పూర్తిగా నిండింది. సమృద్ధిగా వర్షాలు పడుతుండటం వల్ల ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 24,588, ఔట్ ఫ్లో 6568 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుత నీటిమట్టం 1089.4 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటిమట్టం1091 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 81.696 టీఎంసీలుగా ఉండగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలుగా ఉంది.