Normal Deliveries in Telangana : ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణ ప్రసవాలు బాగా తగ్గిపోయాయి. దాంతో సహజంగానే సిజేరియన్లూ విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ సైతం స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాల వల్ల.. బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు అనారోగ్యానికి గురవుతుంటే.. పిల్లలు ముర్రు పాలకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితి మారాలి..! ఇటీవల కామారెడ్డిలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేసిన వాఖ్యలివి. సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా .. క్షేత్ర స్థాయిలో సరైన పర్యవేక్షణ లేక సిజేరియన్ ఆపరేషన్లు పెరిగి పోయాయని అన్నారు. రాష్ట్రంలో కేవలం 34% మంది పిల్లలే.. పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగుతున్నారని.. మిగతా పిల్లలకు ఈ అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెరిగిపోతున్న సిజేరియన్లు..
cesarean deliveries in Telangana : గ్రామం, పట్టణం అనే తేడా లేదు.. అన్ని ప్రాంతాల్లో సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేవి. నేడు ఆ పరిస్థితి మారిపోయి.. గ్రామీణ వాసుల్లోనూ సిజేరియన్ల సంఖ్య పెరుగుతుండడం.. ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుండగా.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జనరల్ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జిల్లా కేంద్ర ఆస్పత్రులకు ఎక్కువగా రిఫరల్ కేసులు వస్తాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి రక్తహీనత, నెగటివ్ రక్త గ్రూపు ఉన్నవారు, ఇతర అత్యవసర కారణాల వల్ల ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడు కచ్చితంగా సిజేరియన్ చేయడం తప్ప మరో మార్గం ఉండటం లేదని ఆస్పత్రి వర్గాలు తెలియ జేస్తున్నాయి. మొదటి సారి కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి వీలైనంత వరకు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఐనా.. శాతాల పరంగా సీజేరియన్లే ఎక్కువగా ఉంటున్నాయి. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గతేడాది మొత్తం 3వేల ప్రసవాలు జరగగా.. ఈ ఏడాది జనవరిలో 300ప్రసవాలు.. ఫిబ్రవరిలో సుమారు 280 ప్రసవాలు అయ్యాయి. ఇందులో 70-80శాతం సిజేరియన్లే ఉన్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రతి నెలా 800-900వరకు ప్రసవాలు జరుగుతుండగా.. ఇందులో 60% వరకు సిజేరియన్లే ఉంటున్నాయి.
ముహూర్తం చూసి కాన్పులు..
Normal Deliveries in Nizamabad : ఈ మధ్య కాలంలో ముహుర్తం చూసి కాన్పులు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటి వారంతా ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఫలానా రోజు, తేది, సమయం పక్కగా చూసుకుని.. పిల్లల్ని కనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు.. మరికొందరు గర్భిణీకి ఎప్పుడు మత్తు ఇవ్వాలి, ఎప్పుడు బిడ్డ బయటకు రావాలన్న విషయాలూ నిర్ణయిస్తుండ టం సిజేరియన్లకు ప్రధాన కారణంగా మారుతోంది. మరోవైపు.. కాలక్రమేణ మహిళలు నొప్పుల్ని భరించలేకపోతున్నారు. దీంతో.. తల్లిదండ్రులు, బంధువులు సైతం తమ అమ్మాయి నొప్పి భరించలేదంటూ.. సిజేరియన్‌కు మెుగ్గు చూపుతున్నారు.
రిస్క్ ఎందుకని..
Normal Deliveries in Kamareddy : కొందరు వైద్యులు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఐనా.. గర్భిణీ కుటుంబం, బంధువుల నుంచి మద్దతు ఉండటం లేదు. సాధారణ ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తితే డాక్టర్లదే పూర్తి బాధ్యత అని చెబుతున్నారు. వైద్యులు రిస్క్ తీసుకోవడం ఎందుకని అనుకుంటున్నారేమో గానీ సిజేరీయన్లకే మెుగ్గు చూపుతున్నారు. కొందరు సాధారణ ప్రసవం చేయించుకోవాలని అనుకుంటున్నప్పటికీ.. శరీరం సహకరించడం లేదు. కారణాలు ఏవైనా గానీ, సిజేరియన్ల వల్ల తల్లులు భవిష్యత్ లో చిన్న చిన్న బరువులు ఎత్తలేని స్థితి ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు.. కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.