తెలంగాణ

telangana

ETV Bharat / state

'కులవృత్తిపై మంత్రి గంగుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం' - gangaputhrulu latest news

కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్.. తమ మనోభావాలు దెబ్బతీశారని నిజామాబాద్ జిల్లా గంగపుత్రులు మండిపడ్డారు. వెంటనే మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

జీఓ నెం.6ను వెంటనే రద్దు చేయాలి : గంగపుత్రులు
జీఓ నెం.6ను వెంటనే రద్దు చేయాలి : గంగపుత్రులు

By

Published : Jun 5, 2020, 8:21 PM IST

Updated : Jun 5, 2020, 8:29 PM IST

కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో చేపల వృత్తికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలను నిజామాబాద్ నగర గంగపుత్ర సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో మంత్రి తీరు పట్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం జలాలతో రైతులు, రజకులు, ముదిరాజులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న మంత్రి.. చేపల వృత్తిపై తొలి హక్కు ఉన్న గంగపుత్రుల పేరును ప్రస్తావించకపోవడంపై సంఘం అధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య గంగపుత్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీఎం మాట మీకు ఎందుకు గుర్తు లేదు ?

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గంగపుత్రులకే చేపల వేటలో తొలి హక్కు.. అని చెప్పిన మాటను బీసీ మంత్రి కమలాకర్ తుంగలో తొక్కారని సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పండ్లు అమ్ముకోవడం ముదిరాజుల కులవృత్తి అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయం మంత్రికి గుర్తు లేదా అని ప్రశ్నించింది. చేపలు పట్టడంపై మొదటి హక్కు గంగపుత్రులదేనని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం మంత్రి గుర్తు పెట్టుకోవాలని అన్నయ్య స్పష్టం చేశారు.

మంత్రిగా ఉంటూ అలా మాట్లాడకూడదు..

గంగపుత్రులు లేని చోట మాత్రమే ముదిరాజులు చేపలు పట్టుకోవచ్చని సీఎం చెప్పిన విషయాన్ని అసోసియేట్ అధ్యక్షుడు మాడవేడి వినోద్ గంగపుత్ర మంత్రికి గుర్తు చేశారు. మొదట మంత్రి... గంగపుత్రుల కుల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. మంత్రి స్థానంలో ఉండి తమ కుల ఉనికిని, చరిత్రను కనుమరుగు చేసే విధంగా మంత్రి వ్రవర్తించడం దారుణమన్నారు. కేవలం ముదిరాజుల పేరే ప్రస్తావించిన మంత్రి కమలాకర్ వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్​కు అప్రతిష్ఠ తెచ్చే విధంగా ఉందన్నారు.

తీరు మారకుంటే ఆందోళన..

భవిష్యత్తులోనూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు చేపల వృత్తికి సంబంధించి ముందు గంగపుత్ర పేరే చెప్పాలన్నారు. తక్షణమే మంత్రి... గంగపుత్రులకు క్షమాపణ చెప్పాలని వినోద్ డిమాండ్ చేశారు. ఇదే తీరు కొనసాగిస్తే గంగపుత్రులంతా ఏకమై ముక్తకంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

జీఓ నెం.6 వల్లే ఈ సమస్యలు..

గంగపుత్రుల జీవనోపాధికి గండికొడుతున్న జీవో నెంబర్ 6ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చెరువులపై పూర్తి హక్కులు గంగపుత్రులకే ఉండాలన్నారు. కార్యక్రమంలో, ఉపాధ్యక్షులు ఆలూరు దాసు, బంగ్లా మధుమోహన్, పాక శంకర్, దీటి రవి, దగ్గుల మధుసూదన్, ముంజాల గంగాధర్, ముడారి వేణుగోపాల్, తోపారం కిషన్, నాగారం శంకర్, స్థానిక సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

జీఓ నెం.6ను వెంటనే రద్దు చేయాలి : గంగపుత్రులు

ఇవీ చూడండి : '15 రోజుల్లోగా వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చాలి'

Last Updated : Jun 5, 2020, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details