ఉమ్మడి నిజామాబాద్‌లో తెరాస జోరు కొనసాగింది. మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాలను చేజిక్కించుకుంది. కానీ నగరపాలక సంస్థలో మాత్రం ఏపార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు.
నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నగరంలో ఎవరికీ దక్కని ఆధిక్యం నిజామాబాద్ నగర పాలక సంస్థలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. భాజపా 28, తెరాస 13, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో విజయం సాధించారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే 34 స్థానాలు అవసరమవగా భాజపా ఆరు స్థానాల దూరంలో ఆగిపోయింది. మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎంఐఎం, తెరాస కలిస్తే 29 స్థానాలుంటాయి. ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లు కలుపుకొని మేయర్ పీఠాన్ని సాధించాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. భాజపా సైతం తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించింది. మేయర్ పీఠాన్ని సాధించేందుకు సమాలోచనలు చేస్తోంది.
పురపోరులో తెరాసదే హవా...
నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో తెరాస స్పష్టమైన ఆధిపత్యం కనబర్చింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాధ్యతగా తీసుకున్న భీమ్‌గల్‌లో తెరాసకు ఎదురులేకుండా పోయింది. 12కు 12 స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. ఆర్మూర్‌లో 36 వార్డుల్లో 23 చోట్ల తెరాస పైచేయి సాధించింది. భాజపా-6, కాంగ్రెస్-1, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించాయి. ఫలితాలు వెలువడిన వెంటనే 14 వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంతియాజ్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో తెరాస పార్టీలో చేరిపోయారు. బోధన్‌లో మాత్రం అధికార తెరాసకు ఎంఐఎం గట్టి పోటీనిచ్చింది. 38 స్థానాలకు తెరాస-19, ఎంఐఎం-11 స్థానాలు దక్కించుకున్నాయి.
కామారెడ్డిలోనూ కారుదే జోరు
కామారెడ్డి జిల్లాలోనూ కారు హవా కొనసాగింది. కామారెడ్డిలో కాంగ్రెస్ పోటీ ఇచ్చినా తెరాసే పైచేయి సాధించింది. మొత్తం 49 స్థానాలకు తెరాస-23 స్థానాలు కైవసం చేసుకోగా..... కాంగ్రెస్-12, భాజపా-8, ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. బాన్సువాడలో 19కి 17 స్థానాలు అధికార తెరాస జయకేతనం ఎగురవేసింది. 2 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురైన ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రలోనూ తెరాస స్పష్టమైన ఆధికత్యం ప్రదర్శించింది. 12కు గానూ 9 స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించగా.... కాంగ్రెస్ 3 స్థానాలతో సరిపెట్టుకుంది.
నిజామాబాద్ నగర పాలకసంస్థలో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడం వల్ల మేయర్ పీఠంపై పీటముడి నెలకొంది. ఎవరు మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారన్న విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. మిగిలిన ఆరు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకోవడం వల్ల శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: 'మరోసారి ఆదరించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు'