Mp Arvind Comments: పార్లమెంట్లో తెరాస ఎంపీలు ముఖం చూపించుకునే వీలులేకే సభ నుంచి వాకౌట్ చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గులాబీ ఎంపీలంతా నల్లదుస్తులు వేసుకుని నల్లికుట్ల మాదిరి వ్యవహరించారని మండిపడ్డారు. తెరాస నాయకుల బండారం బయటపడిందన్న ఆయన... కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెంచిందన్నారు.
రాష్ట్రంలో రైతుల అభివృద్ధిని గాలికొదిలేసి... దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం మొక్కజొన్న రైతుల పరిస్థితి... ఇప్పుడు వరి రైతులకు వచ్చిందని అర్వింద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అయోమయం వల్ల తన నియోజకవర్గంలోనే రూ.150 కోట్ల నష్టం జరిగిందన్న అర్వింద్... అధికారుల దొంగ తూకాల వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు.
రైస్ మిల్లులు, కేసీఆర్, కేటీఆర్ లాభపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దమ్ముంటే తెరాస ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కారు పార్టీ ఎంపీలకు కనీస జ్ఞానం కూడా లేదని ప్రస్తావించారు.
'తెరాస ఎంపీలు నల్లదుస్తులు వేసుకుని నల్లికుట్లలాగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల పెంచింది. తెరాస నాయకులకు ముఖం చూపించుకునే వీలులేకే వాకౌట్ చేశారు. 4 సంవత్సరాల క్రితం మొక్కజొన్న రైతుల పరిస్థితి... ఇప్పుడు వరి రైతులకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అయోమయం వల్ల నా నియోజకవర్గంలోనే రూ.150 కోట్ల నష్టం జరిగింది. రైస్ మిల్లులు, కేసీఆర్, కేటీఆర్ లాభపడుతున్నారు. దమ్ముంటే తెరాస ఎంపీలు రాజీనామా చేయండి.'