నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల పార్క్ డీపీఆర్ తయారు పూర్తైందని... ఇది రైతులకు శుభ పరిణామమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆన్లైన్లో సుగంధ ద్రవ్యాల బోర్డు నిర్వహించిన విక్రయ కొనుగోలుదారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పైసెస్ పార్క్‌కు సంబంధించిన డీపీఆర్‌ను నిధుల కోసం కేంద్ర వాణిజ్య శాఖకు సమర్పించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు బోర్డు సెక్రటరీ సాతియాన్ తెలిపారు.
కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరం పసుపు ఎగుమతులు 42 శాతం పెరిగాయని... సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో అవకాశాలున్నాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సాతియాన్ కోరారు. పసుపు టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించి నిధులు కోసం ప్రయత్నం చేస్తామని వివరించారు. పసుపు డెవలప్మెంట్ పథకాన్ని తెలంగాణ బోర్డు అమలు చేస్తోందని... రైతులు ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్యం, ఎమ్ఎస్ఎమ్ఈల శాఖల నుంచి పథకాల ద్వారా లబ్ది పొందొచ్చని సాతియాన్ పేర్కొన్నారు.