Nizamabad IT HUB Inauguration : మొన్నటిదాకా ఐటీ ఇండస్ట్రీ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే అనుకునేవారు. కానీ, ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరించేందుకు కేసీఆర్ సర్కార్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్‌లను నిర్మించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఐటీ టవర్లలో(Telangana IT Hubs) పలు అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వేల మంది యువత ఉపాధి పొందుతున్నారు. ఈ ఐటీ హబ్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలకు ముందుకు వస్తున్నాయి. ఐటీ రంగాన్ని మరింత విస్తరించే క్రమంలో తాజాగా నిజామాబాద్‌లోనూ ఓ ఐటీ హబ్‌ను నిర్మించారు. ఇక ఇప్పుడు ఈ ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.
KTR Inaugurates Nizamabad IT Hub :నిజామాబాద్ ఐటీ హబ్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రోజున ప్రారంభించనున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. "ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించే కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్‌ను ప్రారంభించబోతున్నాను. ఈ టవర్‌లో టీ-హబ్, టాస్క్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇవి యువత ఆవిష్కరణలు చేసే దిశగా వారికి ప్రోత్సాహం అందించనున్నాయి." అని కేటీఆర్ ట్వీట్(KTR Tweet Today) చేశారు.
Siddipet IT Tower Inauguration : సిద్దిపేట సిగలో మరో మణిహారం.. రేపే ఐటీ హబ్ ప్రారంభం
IT HUB Inauguration in Nizamabad: మరోవైపు నిజామాబాద్ ఐటీ హబ్‌ను కేటీఆర్ ప్రారంభిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha On Nizamabad IT HUB) తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నిజామాబాద్ ఐటీ హబ్‌ను ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆర్టీసీ ఛైర‌్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి ఎమ్మెల్సీ సందర్శించారు. 750 మంది పని చేసే సామర్థ్యంతో ఐటీ టవర్‌ను నిర్మించామని.. ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ఇటీవల ఉద్యోగ మేళాలో 280 మందికి ఆయా కంపెనీలు నియామక ఉత్తర్వులు ఇచ్చాయని చెప్పారు. 200 మంది ఉద్యోగాల్లో చేరేందుకు సంసిద్ధత తెలిపారని పేర్కొన్నారు. వికలాంగ అభ్యర్థులకు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వ్ చేశామని వివరించారు.