Viral fevers in Nizamabad district: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతుండటంతో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. రోగాల బారిన పడుతున్న బాధితులంతా ఆస్పత్రులకు వరుస కడుతున్నారు. సర్కార్ దవాఖానాలతోపాటు ప్రైవేట్‌లోనూ రద్దీ నెలకొంది. విష జ్వరాల బారినపడే వారి సంఖ్య పెరిగింది. వైరల్ ఫీవర్స్‌తో రోగులు సతమతమవుతున్నారు.
మలేరియా కొంత అదుపులో ఉన్నప్పటికీ డెంగ్యూ కేసుల సంఖ్య తీవ్రంగా ఉంది. రోజువారీగా ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి రెట్టింపైంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆగస్టుతో పోలిస్తే జ్వరాలతో చికిత్స పొందిన వారి సంఖ్య రెట్టింపైంది. జూన్‌లో 1080, జులైలో 1360 మంది మాత్రమే జ్వరాలతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆగస్టు నెలలో 2 వేల 4 మంది జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు 416 మంది జ్వరాల బారిన పడ్డారంటే వ్యాధుల తీవ్రత అర్థం చేసుకోవచ్చు.