Nizamabad GGH wonders: సర్కారు ఆస్పత్రి అనగానే సాదాసీదా వైద్యం, ఉండీలేని వసతులు.. అరకొర మందులు, వైద్యులు, సిబ్బంది ఖాళీలు.... ఎప్పుడూ వీటి గురించే వింటాం. కానీ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇందుకు భిన్నంగా ముందుకు సాగుతోంది. కార్పొరేట్‌కు సమాన స్థాయిలో వైద్య సేవలు అందిస్తోంది. ఉన్నంతలో సిబ్బంది, వైద్యులతోనే అద్భుతాలు చేస్తోంది. కార్పొరేట్‌లో లక్షల రూపాయలు వెచ్చించాల్సిన సర్జరీలను సైతం ఉచితంగా చేస్తూ పేదల పాలిట పెన్నిదిలా నిలబడుతోంది. మోకీలు మార్పిడిలు, కంటి మోతె బిందు సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు, ప్రసూతి విభాగంలో అత్యంత క్లిష్టమైన కేసులకు సైతం చికిత్స అందించడంతో రోగుల్లో నమ్మకం పొందుతోంది. అరుదైన చికిత్సలతో ప్రజలకు సర్కారు ఆస్పత్రిపై దీమా కల్పిస్తోంది.
జీజీహెచ్ మంచి గుర్తింపు: కరోనా కాలం నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు పెరుగుతూ వచ్చాయి. అధునాతన చికిత్స యంత్రాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో.... సర్కారు ఆదేశాల కంటే ముందే అరుదైన శస్త్ర చికిత్సలు చేయడం ప్రారంభించారు. కరోనా నుంచి అత్యాధునిక పరికరాలు సీయామ్, ఆధునిక వెంటిలేటర్లు, సీపాప్ యంత్రాలు, ఈసీజీ, 2డీఎకో వంటి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్.. ఉన్న వసతులను సద్వినియోగం చేస్తూ నిపుణులైన వైద్యులతో అరుదైన శస్త్ర చికిత్సలు చేయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జీజీహెచ్ నిజామాబాద్‌కు మంచి గుర్తింపు లభించింది. ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా ముగ్గురు మహిళలకు మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగా... వారంతా కోలుకుని నడుస్తున్నారని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు.
మోకీలు మార్పిడి: గత నెల రోజుల్లో ఐదుగురికి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేశారు. ప్రైవేటులో ఒక్కొక్కరికి రూ. 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చయ్యేది. కానీ జీజీహెచ్‌లో ఉచితంగా సర్జరీలు చేశారు. ప్రైవేటులో చేయించలేక.. మోకాళ్ల నొప్పులను భరించలేక ఏళ్లుగా సతమతమైన రోగులు ఇన్నాళ్లకు ఉపశమనం పొందారు. కోటగిరి మండలానికి చెందిన రమేష్‌కు ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో నడుము విరిగిపోయి మంచానికి పరిమితం కాగా... శస్త్ర చికిత్స చేసి అతన్ని కాపాడారు.