గత పదిరోజులుగా కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. చెరువులు, కుంటలు, చెక్డ్యాములన్నీ కొత్తనీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. నిండిన చెరువులు చూసి.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 1202 చెరువులకు గాను ఇప్పటికే 314 చెరువులు మత్తడి దూకుతున్నాయి. మరో 236 చెరువులు పూర్తిగా నిండాయి. ఇలాగే వర్షాలు కురిస్తే మరో రెండు, మూడు రోజుల్లో మరో 400 చెరువులు పూర్తిగా నిండుతాయి. కాగా.. వరద నీటితో అలుగు దూకుతున్న చెరువులను చూసేందుకు పట్టణవాసులు ఆసక్తి చూపుతున్నారు. నగరానికి సమీపంలో ఉన్న గుండారం, మల్కాపూర్, బర్దిపూర్ చెరువులను చూసేందుకు పట్టణవాసులు తరలివస్తున్నారు. అలుగు దూకుతున్న నీటిలో స్నానాలు చేస్తూ, సెల్ఫీలు దిగుతున్నారు.
మత్తడి దూకిన చెరువులు చూసి.. రైతు కళ్లలో ఆనందం! - నిండు కుండలనుు తలపిస్తున్న చెరువులు
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జలాశయాలు కళకళలాడుతున్నాయి. చిన్న నీటి వనరులు సైతం కొత్తనీటితో తొణికిసలాడుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. మత్తడి దూకుతున్న చెరువులు, కుంటలు చూసి జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా మొత్తంలో బోధన్ నియోజకవర్గంలోనే ఎక్కువ చెరువులు నిండాయి. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో కూడా చెరువులన్నీ నిండాయి. ఎడతెరిపి లేని వర్షాలతో నిండిన జలాశయాలను నీటి పారుదల శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. విస్తారంగా వర్షాలు కురవడం వల్ల జిల్లా రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చెరువు ఆయకట్టు ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఖరీఫ్ పంటలకు భరోసా లభించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని చెరువులు నిండడం వల్ల యాసంగి పంట కూడా వేసుకోవచ్చని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి:ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?