ఊరంతా నిద్ర మత్తులో ఉంటే ఆయన మాత్రం గడ్డపార, గొడ్డలి, కొడవలి సంచిలో వేసుకుని బయల్దేరుతారు. నాటిన మొక్కలే తన పిల్లలుగా భావించి వాటి ఎదుగుదలే లక్ష్యంగా... ఆలనాపాలనా చూసుకుంటారు. ఆయనే నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లికి చెందిన మల్లయ్య. ప్రకృతిపై పెంచుకున్న ఇష్టం కారణంగా... మొక్కలతో గడపనిదే ఆయనకు రోజు గడవదు. ఇది గుర్తించిన పంచాయతీ సభ్యులు, అధికారులు... ఆయనను గ్రామంలో వన సేవకుడి(TREE WARRIOR)గా నియమించారు. హరితహారం(HARITHA HARAM) కింద నాటిన మొక్కలనే తన బిడ్డలుగా భావించి సంరక్షిస్తున్నారు.
సిర్నాపల్లి వనజీవి
ఇష్టమైన పని కావడంతో ఉదయం ఆరు గంటలకే మొక్కల చెంతకు చేరిపోతారు. మొదళ్లలో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించడం...సేంద్రీయ ఎరువులు వేయడం, కొమ్మలను కత్తిరించడంతోపాటు... ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి నాటుతుంటారు. వాటిని పశువుల బారి నుంచి రక్షించుకునేందుకు నిత్యం యుద్ధమే చేస్తారు. ఆరు పదుల వయస్సులోనూ... మొక్కల సంరక్షణ కోసం పోరాడుతున్నారు కాబట్టే... గ్రామస్థులంతా ఆయన్ని సిర్నాపల్లి వనజీవిగా పిలుస్తారు.