తెలంగాణ

telangana

ETV Bharat / state

బియ్యంగా మారకముందే నాణ్యత కోల్పోతున్న యాసంగి ధాన్యం - Boiled Rice Latest News

Sprouted Grain యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యం బియ్యంగా మారకముందే నాణ్యత కోల్పోతోంది. విధానపరమైన నిర్ణయాలు, ప్రకృతి ప్రతికూలతలకు తోడు సరిగా నిల్వ చేయకపోవడం మిల్లర్లకు శాపంగా మారింది. నిజామాబాద్​ జిల్లాలో బస్తాల్లో నింపిన ధాన్యం మొలకలు వచ్చి ఎండుగడ్డిగా మారింది. నిలువ చేసిన చోట ధాన్యం పొట్టుగా తయారైంది.

ధాన్యం
ధాన్యం

By

Published : Aug 27, 2022, 1:29 PM IST

బియ్యంగా మారకముందే నాణ్యత కోల్పోతున్న యాసంగి ధాన్యం

Sprouted Grain: కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నో సవాళ్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసింది. నిజామాబాద్‌ జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం వచ్చింది. రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే సంకల్పంతో కొనుగోళ్లు చేసి బియ్యం మిల్లులకు తరలించారు. మిల్లుల నిల్వ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా తొందరగా తరలించారు. ధాన్యం బస్తాలను ప్లాస్టిక్ కవర్లు, టార్పాలిన్లతో కప్పేశారు. నెలలు గడుస్తున్నా అలానే ఉంచడంతో ప్రస్తుత ధాన్యం మెులకెత్తి గడ్డిలా మారింది.

రోజులు గడుస్తున్న కొద్దీ ధాన్యం పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వాటిని ఆడించడానికి మిల్లర్లు జంకుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని ఎఫ్​సీఐకి పంపాలి. ప్రస్తుతం ఆ మేరకు ఇవ్వలేమని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, తేమతో మొలకెత్తని ధాన్యం బస్తాల నుంచి ఏ మేరకు బియ్యం ఇవ్వగలమో చెప్పలేమంటున్నారు. మరోవైపు గన్నీ సంచుల కొరత వేధిస్తోంది.

మిల్లింగ్ స్తబ్దుగా మారడంతో రూ.1238 కోట్లు విలువ చేసే ధాన్యం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. నష్టాన్ని పూడుస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని ఎఫ్​సీఐకు పంపించాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగడంతో పాటు ఎఫ్​సీఐ గిడ్డంగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సమన్వయం అధికారుల మధ్య ఉంటేనే సవ్యంగా ఉంటుంది.

లేనిపక్షంలో ఎక్కడికక్కడ ధాన్యం, బియ్యం నిల్వలు పెరిగి ఇబ్బందులు ఏర్పడతాయి. గతేడాది వానాకాలంలో సేకరించిన ధాన్యం.. నిజామాబాద్‌ జిల్లాలో ఇంకా 25 శాతం ఉంది. ఇక యాసంగి సీజన్‌కు చెందిన ధాన్యం తరలింపు ప్రక్రియ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బియ్యం సేకరణ విషయమై కేంద్ర ప్రభుత్వం ప్రకటన నేపథ్యంలో గత నెలన్నర రోజులు కస్టమ్ మిల్లింగ్ నిలిచిపోయి ఈ మధ్యే ప్రారంభమైంది. మరో నెలన్నరలో ప్రస్తుత వానకాలం పంటలు మొదలవుతాయి. దీంతో నిల్వ పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదముందని మిల్లర్లు చెబుతున్నారు.

"ప్రభుత్వం చెప్పినట్టు యాసంగి ధాన్యం తీసుకున్నాం. ఇప్పటి వరకూ తీసుకున్న ధాన్యంపై ప్రభుత్వం స్పందించడం లేదు. గన్నీ సంచులు లేవంటున్నారు. ఇప్పటికే చాలా ధాన్యం మెులకెత్తి గడ్డిలా మారింది." -మిల్లర్ల యజమానులు

ABOUT THE AUTHOR

...view details