కరోనా విపత్కర పరిస్థితుల్లో ల్యాబొరేటరీలు, ఆస్పత్రులు రోగులకు విశేష సేవలందిస్తున్నాయని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కొనియాడారు. జిల్లాలో కొవిడ్ రోగుల నుంచి స్కానింగ్ ఫీజు కింద రూ. 5 వేలకు బదులు రూ. 2 వేలు తీసుకోవడానికి సంబంధిత యాజమాన్యాలు అంగీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు కలెక్టరేట్లో.. ఐఎంఏ ప్రతినిధులు, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా, ఇతర వ్యాధుల తీవ్రతను ధ్రువీకరించుకోవడానికి స్కానింగ్ చాలా ముఖ్యమైనదని కలెక్టర్ అన్నారు.
'ఇక నుంచి కరోనా బాధితులకు స్కానింగ్ ఫీజు రూ. 2 వేలే' - nizamabad district news
కరోనా బాధితులకు ల్యాబొరేటరీలు స్కానింగ్ ఫీజు తగ్గించినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచనల మేరకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రూ. 5000 నుంచి 2000కు తగ్గించినట్లు చెప్పారు.
!['ఇక నుంచి కరోనా బాధితులకు స్కానింగ్ ఫీజు రూ. 2 వేలే' nizamabad collector meeting with scanning management](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:28:53:1621169933-tg-nzb-07-16-collector-adhesham-av-ts10123-16052021182041-1605f-1621169441-924.jpg)
ఇందుకు గాను సంబంధిత యాజమాన్యాలు రూ. 4 వేల నుంచి 5 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో ఫీజులు తగ్గించుకోవాలని ఆయన కోరారు. అందుకు సంబంధిత యాజమాన్యాలు, డాక్టర్లు అంగీకరించారు. మంత్రి, కలెక్టర్ సూచించిన మేరకు 2 వేల రూపాయలకే స్కానింగ్ చేస్తామని వారు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. బాల నరేంద్ర, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, ప్రతినిధులు రవీంద్రనాథ్ సూరి, డిప్యూటీ డీఎంహెచ్ఓ తుకారాం, డీఈఎంఓ గంగాధర్, స్కానింగ్ కేంద్రాల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కరోనా బాధితులకు ఉచితంగా ఆహారం అందిస్తోన్న స్వచ్ఛంద సంస్థ