ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు ఆసక్తి చూపిస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో 70వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పడంతో ఉద్యోగార్థులు సిద్ధమవుతున్నారు. పలువురు శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్తుండగా అనేక మంది స్థానిక గ్రంథాలయాల బాట పడుతున్నారు. వాటిల్లో వసతులు, తగినన్ని పోటీ పరీక్షల పుస్తకాలు లేకపోవడంతో అభ్యర్థులకు సమస్యగా(Books shortage nizamabad Library) మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేంద్ర గ్రంథాలయాలు రెండు ఉన్నాయి. మరో 43శాఖా గ్రంథాలయాలు కలవు. గ్రామీణ ప్రాంతంలో 20 గ్రంథాలయాలున్నాయి. మొత్తం 6.03లక్షల పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండగా... ప్రతి రోజూ 5వేలకు పైగా మంది గ్రంథాలయాలకు వచ్చి చదువుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 85 మంది సిబ్బంది ఉండాల్సినా.. 33 మంది మాత్రమే పని చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ (nizamabad Library latest news) సంస్థ కార్యదర్శికే కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయాలకు ఇంఛార్జిగా బాధ్యతలు ఉండటంతో పర్యవేక్షణ ఇబ్బందిగా మారుతోంది.
నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిత్యం 500 మందికి పైగా చదువుకునేందుకు వస్తారు. 300 కుర్చీలు మాత్రమే ఉండటంతో సరిపోవడం (No facilities in nizamabad library) లేదు. గ్రూప్-1, సివిల్స్ సంబంధిత పుస్తకాల కొరత ఉద్యోగార్థులను(comitative Books shortage in Library) వేధిస్తోంది. ఈ-గ్రంథాలయంగా (Digital library) మార్చేందుకు గతంలో ప్రత్యేకంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి... ప్రతి పుస్తకానికి బార్ కోడ్ వేసేందుకు యత్నించారు. కానీ సిబ్బంది లేక నిర్వహణ సరిగ్గా సాగడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పిస్తున్నా అన్ని గ్రంథాలయాల్లో ఇంకా కొరత వేధిస్తూనే ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.