నిజామాబాద్ జిల్లాలో 44, 63 నంబర్ జాతీయ రహదారులు ఉన్నాయి. జిల్లాలోని ఇందల్వాయి టోల్‌ప్లాజా పరిధిలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ నుంచి ఆర్మూర్ వరకు రహదారికి ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. అలాగే బోధన్ నుంచి జిల్లాలోని కమ్మర్పల్లి వరకు 63 రహదారికి పక్కన కూడా మొక్కలు నాటుతున్నారు. ఇందు కోసం గత 20రోజులుగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ జాతీయ రహదారుల పక్కన ఇంకా మొక్కలు నాటాలని సూచించడంతో జిల్లా అధికారులు అవెన్యూ ప్లాంటేషన్‌కు సిద్ధమయ్యారు. అటవీశాఖతోపాటు ఇతర శాఖలను సమన్వయం చేస్తూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి భారీ ఎత్తున మొక్కలు నాటిస్తున్నారు. నాటిన మొక్కలను బతికించుకునేందుకు సైతం కార్యాచరణ చేపట్టారు.
రహదారులకు ఇరువైపులా..
మల్టీ లేయర్ విధానంలో జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే రెండు జాతీయ రహదారులకు ఇరు వైపులా నాలుగు నుంచి ఐదు వరుసల్లో గుంతలు తీశారు. వీటిలో ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తున్న మొక్కలు నాటుతున్నారు. ప్రతి నాలుగు వందల మొక్కలకు ఒక వాటర్ ట్యాంక్, వాచర్‌ను ఏర్పాటు చేసి మొక్కలను బతికించుకునేందుకు ఆదేశాలిచ్చారు. గతంలో నాటిన మొక్కలు ఎండిపోతే.. ఆ స్థానంలో కొత్తగా మొక్కలు నాటుతున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలోనూ ఆర్ అండ్ బీ, పీఆర్ రహదారులలోనూ ఉపాధి హామీ కింద ఇదే విధంగా మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. మొక్కలు పాడైతే రూ.5వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని రోడ్లలోనూ మల్టీ లేయర్ విధానంలో మొక్కలు నాటనున్నట్లు అధికారులు తెలిపారు.