నిజామాబాద్ ధర్నా చౌక్‌లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతు గర్జన సభ నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నాచౌక్ వరకు ర్యాలీ జరిపారు. ఈ రైతు గర్జన సభకు ముఖ్య అతిథులుగా సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హాజరయ్యారు.
పసుపు రైతులకు బోర్డు ఏర్పాటు చేస్తామని అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని ఆర్.నారాయణమూర్తి ఆరోపించారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. ఆ బిల్లులు రైతుల పాలిట వరాలు కాకుండా... శాపాలుగా మారాయన్నారు. విపక్షాలు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిజామాబాద్‌లో ఇంతవరకు పసుపు బోర్డును ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు.
దేశ సంపదను మోదీ సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పొట్టు రంగారావు విమర్శించారు. 75 కోట్ల ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టడానికే రైతాంగ చట్టాలని మండి పడ్డారు. దేశంలో 25 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని, రైతు చట్టాలతో ఆహార భద్రత ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ఆ చట్టాలు రద్దయ్యే వరకు రైతాంగం పోరాడాలని.. న్యూడెమోక్రసీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.