MP Arvind Comments on Double Bedroom Houses : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5-6 లక్షలు ఇస్తానని ప్రకటించి.. ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు. నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. డబుల్ బెడ్ రూమ్ పథకం కోసం బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు.
2020-21లో రూ.10 వేల కోట్లు బడ్జెట్లో పెట్టి ఇళ్లపై రూపాయి ఖర్చు చెయ్యలేదని ఆరోపించిన ఆయన.. నిధులు ఎక్కడికి వెళ్లిపోయాయని ప్రశ్నించారు. 2021-2022లో రూ.10,875 కోట్లు కేటయించామని చెప్పి చివరకు రూ.4800 కోట్లకు కుదించి రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదని మండిపడ్డారు. గత బడ్జెట్లోనూ రూ.12 వేల కోట్లు సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. అసలు ప్రభుత్వం డబ్బులే కేటాయించనప్పుడు ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. దీనిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఆశలు వదులుకోవాలని అర్వింద్ సూచించారు.
"డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై పేద ప్రజలు ఆశలు వదులుకోవాలి. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5-6 లక్షలు ఇస్తానని ప్రకటించి.. ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తామంటున్నారు. 2020-21లో రూ.10 వేల కోట్లు బడ్జెట్లో పెట్టి ఇళ్లపై రూపాయి ఖర్చు చెయ్యలేదు. 2021-2022లో రూ.10,875 కోట్లు కేటయించామని చెప్పి.. చివరకు రూ.4800 కోట్లకు కుదించి రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదు. గత బడ్జెట్లోనూ రూ.12 వేల కోట్లు సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తామన్నారు".- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ