MP Aravind fires on MLC Kavitha: రాష్ట్రంలో భాజపా-తెరాస మధ్య పోరు తారాస్థాయికి చేరింది. మునుగోడు ఎన్నికలు ముగిసినా.. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. కవితను పార్టీ మారాలని సంప్రదించారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో.. ఇరు పార్టీల మధ్య వేడి మరింత రాజుకుంది. తాజాగా నిజామాబాద్‌లోనూ అర్వింద్.. ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఈ ఘటనను భాజపా నేతలు తీవ్రంగా ఖండించారు. తనపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై అర్వింద్ ఘాటుగా స్పందించారు.
కవిత రాజకీయ జీవితం ముగిసిందని అర్వింద్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆమె ఎక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదన్నారు. భాజపా నుంచి వందల కోట్ల ఆఫర్ ఎవరిచ్చారో కేసీఆర్ చెప్పాలని పేర్కొన్నారు. పోలీసులు గులాబీ కండువాలకు అమ్ముడు పోయారని మండిపడ్డారు. ఇంట్లో ఉన్న తన తల్లిపై దాడి చేయటం ఎంత వరకు సమంజసమని అర్వింద్ ప్రశ్నించారు.
కవితపై తాను పరుషపదాలు వాడలేదన్న ఎంపీ అర్వింద్.. 2024లో తనపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచే నిలబడతానని పేర్కొన్నారు. ఎంపీల పైన ఎన్నోసార్లు దాడులు జరిగాయన్న ఆయన.. తన మీద దాడి కొత్త కాదన్నారు. కవిత ఎన్నికలే గెలవలేదు.. ఈ రోజు ఆమె కూర్చున్న ఎమ్మెల్యేలే ఆమెను ఓడగొట్టారని వ్యాఖ్యానించారు. తాను కవిత మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న అర్వింద్.. మల్లికార్జున్ ఖర్గేకి ఫోన్ చేశారని చెప్పా.. నిజం కాకపోతే ఖండించాలని ధ్వజమెత్తారు.
అసలేం జరిగిందంటే..భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: