MP Aravind fires on Kavitha Comments: తెరాస ఎమ్మెల్సీ కవితను పార్టీలో చేరాలని భాజపా నేతలు అడిగినట్లు సీఎం కేసీఆరే చెప్పారని.. అప్పుడు ఆయన ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. ఇవాళ తన ఇంటిపై దాడి చేసినట్లే కేసీఆర్ ఇంటిపై కూడా కవిత దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై తెరాస దాడికి దిగిందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో తన ఇంటిపై దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యాఖ్యలు చేస్తే దాడి చేస్తారా అన్న అర్వింద్.. ఇలా ఇంటిపై దాడి చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. కవిత రాజకీయ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఆమె రాజకీయ జీవితం దాదాపు ముగింపు దశకు చేరుకుందన్న ఆయన... రాజకీయంగా తనను ఓడిస్తానని కవిత అంటున్నారని పేర్కొన్నారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కవితపై పోటీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న అర్వింద్... 2024 ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. తాను ఏవేవో వ్యాఖ్యలు చేశానని కవిత ఈ స్థాయిలో స్పందించారని అర్వింద్ ధ్వజమెత్తారు.
కేసీఆర్, కేటీఆర్, కవితకు అహంకారం ఎక్కువైంది: ఎంపీ అర్వింద్
'కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత ఒకరు కవిత కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. మరి ఈ విషయంపైనా విచారణ చేస్తే బాగుంటుంది. అందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు కదా.. కవితదీ ట్యాప్ చేస్తే విషయం తేలిపోతుంది. ఇంట్లో ఉన్న నా తల్లిదండ్రులు, ఇంటి సిబ్బంది దాడి చేసే హక్కు ఆమెకు ఎవరిచ్చారు. కేసీఆర్, కేటీఆర్, కవిత.. విపరీతమైన కుల అహంకారంతో మాట్లాడుతున్నారు. ఇదేమన్నా దొరల పాలన అనుకుంటున్నారా? భాజపా వాళ్లు కవితకు ఫోన్ చేశారని కేసీఆర్ చెప్పారు.. అలాగే కాంగ్రెస్ వాళ్లు కవితను సంప్రదించారని నాకు తెలిసింది. అదే చెప్పా.. అంతే.. అభ్యంతరకరంగా ఏం మాట్లాడలేదు. మేం ఎవరినీ వదిలిపెట్టం. ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాం'- అర్వింద్, భాజపా ఎంపీ
178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేస్తే వారిలో ఇవాళ 71 మంది అధికారికంగా భాజపాలో చేరారని అర్వింద్ పేర్కొన్నారు. తనపై చీటింగ్ కేసు వేస్తానని కవిత అంటున్నారన్న ఆయన.. ఆ కేసు మీ నాన్నపై వేసుకోండని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలు మొత్తం చీటింగే అని ఆరోపించారు. తమకు ప్రతి పార్టీలో దోస్తులుంటారన్న అర్వింద్... ఏ విషయమైనా తమకు తెలుస్తుందని అన్నారు. దమ్ముంటే 2024 ఎన్నికల్లో కవిత తనపై పోటీ చేసి గెలవాలని అర్వింద్ సవాల్ విసిరారు.
ఇవీ చదవండి: