మృత్యు మార్గాలుగా ధాన్యం కుప్పలు పోసిన దారులు Farmers pouring crop on roads: రోడ్డు పక్కన వడ్ల కుప్పలు తప్పించబోయి... వాహనాలు బోల్తా కొడుతున్నాయి. రహదారి మధ్య వరకు ఇలా వరి ధాన్యం ఆరబోయడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యాంపై వాహనాలు వెళ్లకుండా పెద్దపెద్ద బండ రాళ్లు పెట్టడం.. అది గమనించని వాహనదారులు వాటిని ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు.
పంటలో తేమను తగ్గించుకొనేందుకు అన్నదాతలు రహదారులకు ఇరుపక్కల ధాన్యం ఆరబెట్టడం వాహనదారుల పాలిట యమగండంగా మారింది. సగం రోడ్డు వడ్ల కుప్పలతో నిండిపోవడంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. చాలా మంది రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పొడంతో పాటు గాయాలపాలవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ తరహాలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పొతున్న ఘటనలు ఏటా జరుగుతూనే ఉన్నాయి.
సీజన్ రాగానే కర్షకులు రోడ్లపైకి ధాన్యం తేవడం వల్ల దారులన్నీ కల్లాలుగా మారుతున్నాయి. కల్లాలు లేకపోవడం, కల్లాల దగ్గర వాహన సదుపాయం లేకపోవడం వల్లే రోడ్లపై ఆరబోస్తున్నామని సాగుదారులు చెబుతున్నారు. అధికారులు కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నందునే రోజుల తరబడి రోడ్లపై పడిగాపులు కాస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. రాత్రి పూట వచ్చే వాహనదారులతోపాటు రోజంతా ప్రయాణించేవారు ఎదురొచ్చే వాహనాలు తప్పించబోయి రాళ్లకు ఢీకొడుతున్నారు.
రోడ్డుకు ఇరు వైపులా పోయడంతోపాటుగా రహదారి సగం వరకు ధాన్యం రాశులు నిండిపోవడంతో.. వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనదారులు భయంతో ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. వేల కల్లాల నిర్మాణం కోసం అధికారులు అనుమతులు ఇచ్చారు. అధికారులు అవగాహన కల్పించినా ఎక్కువమంది రైతులు ముందుకు రాకపోవడం వల్ల సగం మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి వాహనదారులు, రైతులకు నష్టం జరగకుండా పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: