శిథిలావస్థకు చేరిన భవనాలు.. చెరువులను తలపిస్తున్న ఆవరణలు.. ఇదీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్కారు బడుల పరిస్థితి. ఇది ఏ ఒక్క బడిలోనో అనుకుంటే పొరపాటే. దాదాపు ఉమ్మడి జిల్లా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. అసలు బడికి వెళ్లాలంటేనే విద్యార్థులు, పంపించాలంటే వారి తల్లిదండ్రులు భయపడే పరిస్థితులున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే విద్యార్థులకు అవస్థలు మొదలైనట్లే.
నిజామాబాద్ జిల్లాలో 1154 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 75 శాతం పాఠశాలలు మరమ్మతుకు గురయ్యాయి. 492 బడులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో 1011 పాఠశాలలు ఉండగా.. పెద్ద ఎత్తున మరమ్మతులు చేయాల్సిన గదులు 227 ఉన్నాయి. 346 గదులు పాక్షిక మరమ్మతులు చేయాల్సి ఉంది. సుమారు 423 కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాల ఐదేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. గదుల పైకప్పుల రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వానపడితే ఆవరణ చిన్న సైజు చెరువును తలపిస్తుండగా.. తరగతి గదుల్లోకి నీరు చేరుతుంది. డిచ్పల్లి మండలంలోని పాఠశాలల పరిస్థితి ఇలానే ఉంది. ధర్పల్లి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉన్న మూడు గదులు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల అధికారులు వచ్చి పరిశీలించినా పరిస్థితి మాత్రం మారలేదు.
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఐదు గదులూ శిథిలావస్థకు చేరాయి. నందిపేట మండలం తల్వెద ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు కిటికీలు, తలుపులు లేవు. గోడలు బీటల వారాయి. జూన్ నెలలో విద్యార్థుల తల్లిదండ్రులు అధ్వాన పరిస్థితులపై నిరసన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. మాక్లూర్ మండలం అమ్రాద్ ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు మరమ్మతులకు గురై వాన నీరు తరగతి గదుల్లోకి చేరుతోంది.