MLC Kavitha on Rahul Gandhi Mulugu Speech :నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో ఎమ్మెల్సీ కవిత నేడు పర్యటించారు. ఈ సందర్భంగా ములుగు బహిరంగ సభలో బుధవారం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. వారి తెలంగాణ.. వీరి తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని విడగొట్టేలా రాహుల్ మాట్లాడారంటూ కవితవిమర్శించారు. ఈ క్రమంలోనే రూ.లక్ష కోట్లలోపు ప్రాజెక్టుల్లో.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని సూటిగా ప్రశ్నించారు. హస్తం పార్టీ మాదిరిగా కమీషన్లు తీసుకుంటే చెరువుల్లోకి నీరు కాకుండా.. రైతుల కంట కన్నీరు వచ్చేదన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ధరణి, 24 గంటల కరెంట్ దూరమవుతుందని చెప్పారు. తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని కవిత తెలిపారు.
MLC Kavitha Fires on Revanth Reddy : సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపైనా ఆమె స్పందించారు. గనులను మూసేసి కార్మికులకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్న ఆమె.. తాడిచర్ల మైన్‌ను ప్రైవేటుకు ఇచ్చింది హస్తం పార్టీనే అని గుర్తు చేశారు. మాయమాటలు చెబుతున్న ఆ పార్టీని సింగరేణి కార్మికులు నిలదీయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటోందని.. ధరణిని రద్దు చేస్తే రైతుబంధు ఎలా వస్తుందని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే 24 గంటల కరెంటు ఉండదని ఆరోపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ పథకాలను చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్న ఆమె.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
"గనులను మూసేసి కార్మికులకు అన్యాయం చేసిందే కాంగ్రెస్. తాడిచర్ల మైన్‌ను ప్రైవేటుకు ఇచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీని సింగరేణి కార్మికులు నిలదీయాలి. తెలంగాణ పథకాలను చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తుంది." - ఎమ్మెల్సీ కవిత