Mlc Kavitha Comments: కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకర్ని చేయమంటే సాధ్యం కాదని.. అభివృద్ధి చేస్తున్న వారికి సహకరించి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో రూ.33 కోట్లతో చేయబోయే అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిపి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత పాల్గొన్నారు.
Mlc Kavitha Comments: ప్రతిపక్షాలు చెప్పే మాటలతో అభివృద్ధి జరగదని కవిత పేర్కొన్నారు. రాజకీయాల కోసం చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారని.. ప్రజలు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో గమనించాలని సూచించారు. దేశంలోనే అభివృద్ధి సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటోందని.. ప్రజలు సహకరించి రెండు సార్లు అధికారం ఇవ్వడం వల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు. భాజపా నేతలు చెప్పిన మాటలు విని.. ఎంపీ ఎన్నికల్లో ఒకసారి పొరపాటు చేశారని.. మళ్లీ అది జరగొద్దని మంత్రి ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తే ఇంకా పనులు చేయాలని అనిపిస్తుందన్నారు. మాయమాటలు విని మోసపోవద్దన్నారు.
కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే కష్టమైతది. ఆ విషయాలను మీరు ఇప్పటి నుంచే గుర్తుపెట్టుకోవాలి. కత్తి ఎవరికి ఇవ్వాలి... యుద్ధం ఎవర్ని చేయమనాలే అనే విషయం మీరు ఆలోచించుకోవాలి. రాజకీయం కోసం ఏమైనా మాట్లాడొచ్చు. భాజపా వాళ్లు ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ మాటలతోటి పనులు కావు. మన ఇంటికి ఒక ముద్ద అన్నం దొరకదు. జరుగుతున్న అభివృద్ధిలో మీరు ఇంకా మద్దతు ఇస్తే బావుంటుంది.