రాష్ట్ర ప్రజల కోసం తెరాస ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన... పలు గోదాములకు శంకుస్థాపనలు చేశారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో రూ.7 కోట్ల వ్యయంతో పదివేల మెట్రిక్ టన్నుల గోదాం పనులను ప్రారంభించారు. అదేవిధంగా భీంగల్ మండలంలోని సికింద్రపూర్ గ్రామంలో రూ.7 కోట్ల వ్యయంతో పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువచేసే గోదాములకు శంకుస్థాపన చేశారు.
Minister Vemula: 'సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం'
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బాల్కొండ నియోజకవర్గ పరిధిలో కేవలం 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువచేసే గోదాములు మాత్రమే ఉండేవని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల లోపు బాల్కొండ నియోజకవర్గ పరిధిలో 30వేల టన్నుల గోదాములు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా మరో రెండు భారీ గోదాములు.. ఒక్కోటి పదివేల మెట్రిక్ టన్నుల చొప్పున నిర్మించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ రెండు గోదాముల పనులు పూర్తి అయితే మొత్తం 55వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ చేసే గోదాములు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇదీ చదవండి:Huzurabad By Election: ఇంత తక్కువిస్తున్నారేంది.. మా ఓట్లు అంత చీపా..?