వర్షాకాలంలో నీటిని తోడేందుకు పల్లికొండ లిఫ్ట్ పూర్తైందని, పైప్లైన్ చిన్న చిన్న మరమ్మతులు వారం రోజుల్లో పూర్తవుతాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి(minister prashanth reddy) అన్నారు. ఈ లిఫ్ట్ ద్వారా సుమారు 7 గ్రామాలకు సాగునీటిని అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నిజాంసాగర్ పాత కాల్వ ద్వారా జానకంపేట మల్లాడి చెరువు నింపే ఫీడర్ ఛానల్ను మంత్రి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, వేల్పూర్ మండలాల్లో గురువారం ఆయన పర్యటించారు.
క్షేత్ర స్థాయిలో పరిశీలన
పైప్లైన్ వేయాల్సిన ఫీడర్ చానల్ స్థలాన్ని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అనంతరం పల్లికొండ ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్ట్, మోటర్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ వర్షాకాలంలో నీటిని తోడేందుకు సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.