నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ సేవల వివరాలను ఎప్పటికప్పుడూ ఆన్లైన్లో ఉంచాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్, వైద్యాఆరోగ్య శాఖ, సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. పలు విషయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి అన్నారు. ప్రజలను కాపాడుకోవడానికి ఎంత ఖర్చయినా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా పరీక్షల నిర్వహణలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లో 2,625 లక్ష్యమైతే అంతకు రెట్టింపు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వ్యాక్సినేషన్ కూడా లక్ష్యానికి అనుగుణంగా జరుగుతోందన్నారు.