తెరాస హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులంటే పేద ప్రజలకు నమ్మకం ఏర్పడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో డయాగ్నోస్టిక్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సెంటర్‌లో 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారని వెల్లడించారు. పేద ప్రజలు ఆసుపత్రికి వెళితే వివిధ రకాల పరీక్షలకు వేలల్లో డబ్బులు ఖర్చవుతుంన్నందున, ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు చేయాలనే... ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు ఆసుపత్రులను పట్టించుకునే వారు కాదని, తమ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజల కోసం ఎన్నో ఆసుపత్రులను నిర్మించి, అభివృద్ధి చేసిందని తెలిపారు. గతంలో ప్రజలు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకునే వారని, ఇప్పుడు నిజామాబాద్ లోనే 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకునే సౌలభ్యాన్ని తమ ప్రభుత్వం కల్పించిందని మంత్రి వెల్లడించారు. పరీక్షల అనంతరం రోగి ఫోన్‌కు రిపోర్టులు మెసేజ్ రూపంలో వెళ్తాయని వివరించారు.