Minister Prashanth Reddy Comments: తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదని ప్రధాని వ్యాఖ్యలు సరి కాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మోదీతో రాష్ట్ర భాజపా నేతలు క్షమాపణ చెప్పించాలని మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే భాజపా నేతలను ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటారని హెచ్చరించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్‌లో పర్యటించారు. పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి తప్పినందుకు ప్రజలు ఎంపీ అర్వింద్‌ను అడ్డుకుంటున్నారని ఇక ముందూ అడ్డుకుంటారన్నారు. తెలంగాణ పుట్టుక గురించి ప్రధాని రాజ్యసభలో మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నారని విమర్శించారు. అలాంటి నేతలను అడ్డుకోవడంలో తప్పులేదని చెప్పుకొచ్చారు.
మొన్న రాజ్యసభలో నరేంద్రమోదీ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తడు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సరిగ్గా జరగలేదని వ్యాఖ్యానిస్తడు. ఎంత ధైర్యం నరేంద్రమోదీకి. ఎనిమిది సంవత్సరాల తర్వాత తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తడా? ఇది భావ్యమా? పార్లమెంట్‌లో పాసైన బిల్లును ప్రశ్నిస్తడా? అంటే తెలంగాణ ప్రజలను అవమానం చేసినట్టు కాదా? తెలంగాణ ఏర్పాటు కరెక్ట్‌గా లేదంటే మళ్ల ఆంధ్రాలో కలుపుతరా? ఏంది మీ ఉద్దేశం? భాజపా రాష్ట్ర నాయకులరా.. ప్రధాని అందరివాడని ఇప్పటిదాకా అనుకున్నం. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించినయి. ప్రధానమంత్రి మోదీతో మీరు క్షమాపణ చెప్పించండి. రాజ్యసభలో తెలంగాణ పుట్టుకపై చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పించాలి.