Prashant Reddy Fires On Central Government: తెలంగాణలో మతాల మధ్య చిచ్చు పెట్టడం భాజపా నేతలు మానుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. భాజపా తీరును ఆయన తప్పుపట్టారు. భాజపా ప్రభుత్వం తెలంగాణ మీద గజనీ మహమ్మద్ కంటే ఎక్కువగా దండెత్తుతోందని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా దండయాత్రకు వస్తారా అని విమర్శించారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికైనా భాజపా పద్దతి మార్చుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. కేంద్రంలో ఎప్పటికీ భాజపా ప్రభుత్వమే ఉండదని.. ఇది ప్రజాస్వామ్య దేశం అన్న సంగతే మర్చిపోయారా అని ప్రశ్నించారు. అదేవిధంగా హైదరాబాద్కు వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
"తెలంగాణ మీద గజనీ మహమ్మద్ కంటే ఎక్కువగా కేంద్రం దండయాత్ర చేస్తుంది. అటు కేంద్ర మంత్రుల తోటి దండయాత్ర చేపిస్తున్నారు. ఇటు గవర్నర్ తోటి దండయాత్ర చేపిస్తున్నారు. మనం జాతీయజెండా ఎగురవేసి జాతీయతాభావాన్ని చాటి చెబుతున్నాం. అటువంటి సందర్భంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్లో కవాతు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టి పోతున్నారు. దేశంలో ఎక్కడికైనా పోయారా లేక తెలంగాణకే ఎందుకు వస్తున్నారు. ఇది దేనికి సంకేతం. ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు." -ప్రశాంత్ రెడ్డి మంత్రి