Minister KTR fire on Narendra Modi: నిజామాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్‌మెంట్ డైలాగ్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ అనే అంశంపై మాట్లాడారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. అనంతరం రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిందని.. ఈ ప్రాజెక్టుపై అవగాహన లేనివారు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం పాత కలెక్టరేట్ వద్ద ఇందూరు కళాభారతి భవనానికి శంకుస్థాపన చేశారు. 50 కోట్ల నిధులతో నిర్మించే కళాభారతి.. కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు, పిల్లలకు చక్కటి అపురూపమైన కానుకని పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో జిల్లా అభివృద్ధికి 936 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. కొత్తగా 100 కోట్ల రూపాయలు అభివృద్ధికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 21 కోట్లతో నిర్మించిన కంటేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం నిజామాబాద్ జిల్లా భారాస కార్యాలయంలో విలేకరులతో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని అన్నారు. మాటల్లో సబ్ కా సాథ్ అంటున్న కేంద్రం.. చేతల్లో మాత్రం సబ్ కుచ్ బక్వాస్ అని విమర్శించారు. ఎనిమిదిన్నరేళ్లయినా రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క రూపాయి నిధులివ్వలేదని.. ఒక్క విద్యాసంస్థ కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని.. చిత్తశుద్ది ఉంటే తెలంగాణా కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.