KTR Comments On BJP And Congress : బీజేపీని గల్లా పట్టి గల్లీలో నిలదీయాలని.. డిపాజిట్లు గల్లంతు చేసి మోదీకి బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) విమర్శించారు. అభివృద్ధి చేసే వారిని కులమతాలకు అతీతంగా గెలిపించాలని.. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే వారిని ప్రజలు అసలు నమ్మెద్దని అన్నారు. నిజామాబాద్‌లో ఐటీ టవర్(Nizamabad It Tower)ను ప్రారంభించిన.. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన బీఆర్ఎస్(BRS) పార్టీ సభలో పాల్గొని ప్రసంగించారు.
'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని దాశరథి జైల్లో బొగ్గుతో రాశారని.. అలాంటి పట్టణానికి రూ.50 కోట్లతో కళాభారతి నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఒకప్పుడు నెర్రలు వారిన నేలల్లో నేడు జలధారలు పారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించామని.. ఇక్కడ ధాన్యం ఉత్పత్తి 60 వేల టన్నుల నుంచి 3.5 లక్షలకు చేరిందని ఆనందించారు.
KTR Fires at Central Government : 'నేతన్నలపై.. రాష్ట్ర సర్కార్ వరాల జల్లు '
KTR Fire On MP Dharmapuri Arvind : గత 60 ఏళ్లలో చూడని వాటిని ఈ 9 ఏళ్లలో చూస్తున్నామన్నారు. పెద్దలకు గౌరవించడం హిందూ సంప్రదాయం, ఆధునికుల నాగరికత అని కేటీఆర్ హితబోధ చేశారు. అలాంటిది నిజామాబాద్ ఎంపీకి పెద్దలను గౌరవించటం కూడా తెలియదని విమర్శించారు. మతం గురించి మాట్లాడి రెచ్చగొట్టడం ఒక్కటే ఎంపీ అర్వింద్‌కు తెలుసని ధ్వజమెత్తారు. ప్రతిదానికి హిందూ, ముస్లిం అని మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారన్నారు. ఈసారి అర్వింద్ ఎక్కడ నుంచి పోటీ చేసిన డిపాజిట్లు గల్లంతు అవ్వడం ఖాయమని హెచ్చరించారు.
గ్యాస్ సిలిండర్ ధర రూ.450 ఉన్నప్పుడు సిలిండర్‌కు మొక్కాలని ఆనాడు మోదీ అన్నారని.. కానీ ఇవాళ అదే సిలిండర్ ధర రూ.1200కు మోదీ పెంచారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్లే అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్లు కూడా కేసీఆర్ మీద ఎగబడి మాట్లాడుతున్నారని.. కొత్తగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నది వాళ్లే కదా అని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.