వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. రకరకాల పనులు చేసుకొంటూ పొట్టనింపుకొన్నారు. కరోనా మహమ్మారితో పనులన్నీ నిలిచిపోయాయి. పూట గడవడం కష్టమైంది.. లాక్‌డౌన్ ఎన్ని రోజులుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు సొంతూళ్లకు బయలుదేరారు. వాహనాలు లేకపోవడం వల్ల కాలినడకన వెళ్తున్నారు.
సొంతూళ్ల బాట పట్టిన వలస కూలీలు నిజామాబాద్ జిల్లా పరిధిలో జాతీయ రహదారి వెంట ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉంటున్నారు. జాతీయరహదారి వెంట ఉన్న పల్లెలు వలస కూలీలను అక్కున చేర్చుకొంటున్నాయి. రాత్రిళ్లు వసతి కల్పించడమే కాకుండా అన్నదానాలు చేస్తూ అండగా నిలుస్తున్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన దాతలు మూడు ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నారు.
బాధ్యత ఓ చేతిలో.. బరువు మరో చేతిలో..
నాలుగురోజులుగా తిండి దొరకడంలేదని. మరో మూడునెలల వరకు పని లేదని మేస్త్రీ చెప్పడం వల్ల సొంతూరి బాట పట్టామన్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్ . రెండ్రోజుల క్రితం చిన్నారులతో కలిసి రామంతపూర్ నుంచి బయలుదేరాం. ఇంటికి చేరే సరికి ఇంకో వారం పడుతుంది. ఈ కష్టం శత్రువులకు కూడా రావొద్దని దేవుణ్ని ప్రార్థిస్తున్నామని చెప్పారు.
మాయదారి రోగం పొట్టన పెట్టుకొనేలా ఉంది...
ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం వల్ల నెలరోజుల నుంచి ఉపాధి కరవైందన్నారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సోమా. ఇన్ని రోజులు ఒకపూట కడుపునింపుకొని బతికాం. ఇక తినడానికి తిండి లేక సొంతూరికి బయల్దేరాం. మరో నాలుగు రోజుల్లో మా ఊరికి చేరుకుంటాం. దారిపొడవునా దాతల సాయంతో పొట్ట నింపుకుంటున్నాం. చిన్నారుల కాళ్లకు బొబ్బలు వస్తుండటం వల్ల వారిని ఎత్తుకొనే నడుస్తున్నాం. ఆ మాయదారి రోగం సోకకుండానే మమ్మల్ని పొట్టన పెట్టుకొనేలా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.