Road Accident In Medak : 'మృత్యువు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. పెట్టెలో దాక్కొని తాళం వేసుకొని భద్రంగా దాక్కున్నా.. వెంబడించి మరీ తరుముకు వస్తుంది.' మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన చూస్తే పెద్దలు అన్న ఈ మాట నిజమే అనిపిస్తోంది. గుండె పోటు నుంచి తప్పించుకొన్న ఆ వ్యక్తి.. రోడ్డు ప్రమాదం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. జిల్లాలోని తూప్రాన్ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదం అందరి హృదయాలను చలింప చేసింది.
ఇదీ జరిగింది: నిజామాబాద్ జిల్లా దుద్గాన్‌కు చెందిన బాపయ్యకు 15 రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. సరైన సమయంలో స్పందించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం అందించి ఆయనను ప్రాణాపాయం నుంచి తప్పించారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించారు. ఆపరేషన్ సమయంలో వేసిన కుట్లను తొలగించుకునేందుకు బాపయ్య.. అతని కుమారుడు మల్కన్న, కుమార్తె పద్మ శుక్రవారం తమ స్వస్థలం నుంచి ఆసుపత్రికి బయళ్దేరారు. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
గుండెపోటును జయించి..: హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు టైర్ పగిలిపోయింది. దీంతో కారు డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారు ముందు సీటులో కూర్చున్న బాపయ్య తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డాడు. ప్రమాదంలో కుమారుడు, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. అప్పటి వరకు తమతో ఆరోగ్య సమస్యలు.. కుటుంబ పరిస్థితుల గురించి చర్చించుకుంటూ వచ్చిన తండ్రి.. తమ కళ్లెదుటే విగతజీవిగా మారడంతో ఆ పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కారులో ఇరుక్కుపోయిన తండ్రిని కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నం అక్కడున్న వారిని కలచివేసింది. రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడన్న విషయాన్ని రోధిస్తూ కుటుంబసభ్యులకు చెప్పిన తీరు అక్కడున్న వారిని చలింప చేసింది. ప్రమాద విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ యాదగిరి.. ఘటనా స్థలానికి వచ్చి ప్రమాద తీరును పరిశీలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు నుంచి తప్పించుకున్న బాపయ్యను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడం అక్కడున్న వారిని కలచివేసింది.
ఇవీ చదవండి: