MBBS student suicide in Nizamabad : నిజామాబాద్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య తీవ్ర విషాదం మిగిల్చింది. మరో పదిహేను రోజులు గడిస్తే ఎంబీబీఎస్ పూర్తయ్యే సమయంలో ఆత్మహత్య చేసుకోవడం కళాశాలలో కలకలం రేపింది. ఆపదలో ఉన్న వారికి ప్రాణాలు పోస్తాడనుకున్న కుమారుడు అర్దాంతరంగా ప్రాణం తీసుకోవడంతో ఓ మధ్య తరగతి కుటుంబం కన్న కలలు కల్లలయ్యాయి. ఎప్పుడూ చదువుల్లో ముందుండే కొడుకు ఉన్నపళంగా ఉసురు తీసుకున్నాడన్న వార్త విన్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.
మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన దాసరి హర్ష చురుకైన విద్యార్థి. డాక్టర్ కావాలన్న పట్టుదలతో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగేళ్లు ఎంబీబీఎస్ చదివాడు. 3 సంవత్సరాల పాటు అన్నిట్లో మెరిట్ మార్కులు సాధించాడు. ఇంకో 15 రోజులైతే అన్ని పరీక్షలు పూర్తయి కోర్సు ముగిసేది. ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగుతుండగానే... హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెల్లవారితే పరీక్ష రాయాల్సిన హర్ష అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే... హర్ష మరణానికి కారణాలు బయటకు వచ్చాయి. అతనికి కొంత కాలంగా బ్యాక్ పెయిన్ ఉన్నట్లు తెలుస్తోంది. హర్ష ఆత్మహత్యకు ఈ ఆరోగ్య సమస్యలే కారణం కావొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు... హర్ష మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు హర్ష గత కొంత కాలంగా తీవ్రమైన వెన్నునోపితో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. నిన్న రాత్రి 9 గంటలకు హర్ష తనకు కాల్ చేశాడని, నొప్పి విపరీతంగా ఉందని చెప్పినట్లు తల్లి.. రాధ తెలిపింది. హర్ష కు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, పరీక్షలు పూర్తయ్యాక ఇంటికి వస్తానని చెప్పినట్లు వివరించింది. తన కొడుకు ఇలా ప్రాణాలు తీసుకుంటాడనుకోలేదని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. హర్ష మృతితో కళాశాలలో విషాదం నెలకొంది. తోటి విద్యార్థులు హర్ష మృతితో కన్నీరు పెట్టుకున్నారు.
ఇవీ చదవండి: